Telugu Global
Andhra Pradesh

విశాఖను అభివృద్ధి చేస్తారట..! పవన్ కల్యాణ్ సెటైర్లు

బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్.

విశాఖను అభివృద్ధి చేస్తారట..! పవన్ కల్యాణ్ సెటైర్లు
X

ఏపీకి మూడు రాజధానులా లేక విశాఖ ఒక్కటే రాజధానా అనే హాట్ డిస్కషన్ జరుగుతున్న వేళ, విశాఖ పట్నంలో అంబులెన్స్ అందుబాటులో లేక పసి బిడ్డ మృతదేహంతో దంపతులు 120కిలోమీటర్ల దూరం మోటర్ సైకిల్ పై వెళ్లిన ఘటన కలకలం రేపింది. భావి రాజధానిగా కీర్తింపబడుతున్న విశాఖ, త్వరలో గ్లోబల్ సమ్మిట్ కోసం ముస్తాబవుతున్న విశాఖలో కనీసం పేద ప్రజలకు అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులో లేదా అనే విమర్శలు వినపడుతున్నాయి. ఈ వ్యవహారంపై కాస్త ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. ఆసుపత్రులు మెరుగుపరచరు కానీ రాజధానిగా విశాఖను అభివృద్ధి చేసేస్తారట అంటూ ఎద్దేవా చేశారు.

సీఎం క్షమాపణ చెప్పాల్సిందే..

బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్. విశాఖపట్నంలోని కేజీహెచ్ లో ఓ శిశువు మృతి చెందడంతో అంబులెన్స్ సౌకర్యం లేక తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. పాడేరు ప్రాంతం ముంచింగుపుట్టు మాండ్లం కుమడ గ్రామానికి చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతులు చనిపోయిన తమ బిడ్డను తీసుకుని కేజీహెచ్ నుంచి మోటర్ సైకిల్ పై వెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.


కేజీహెచ్ లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా కూడా వారిని ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు పవన్ కల్యాణ్. నాడు-నేడు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. గతంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, అప్పుడే ప్రభుత్వం తప్పుని సరిదిద్దుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైందని ప్రశ్నించారు. అంబులెన్సుల నిర్వహణ కూడా సక్రమంగా ఉండటం లేదన్నారు. బెంజి సర్కిల్ లో 108 అంబులెన్సులు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే ప్రయోజనం ఉండదని విమర్శించారు. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే- విశాఖలో రాజధాని అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్.

First Published:  17 Feb 2023 4:43 AM GMT
Next Story