Telugu Global
Andhra Pradesh

రుషికొండ ప్యాలెస్ బదులు ఓ హార్బర్ కట్టొచ్చు కదా..

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే దండుపాళ్యం గ్యాంగులు రెచ్చిపోతాయని, బోటు ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు పవన్.

రుషికొండ ప్యాలెస్ బదులు ఓ హార్బర్ కట్టొచ్చు కదా..
X

విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన బాధితులను పరామర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 49మంది బాధితులకు ఒక్కొక్కరికి రూ.50వేలు పరిహారంగా అందించారు. విశాఖ రాకుండా తనను అడ్డుకోవాలని చూశారని, తాను బుక్ చేసుకున్న విమానాలను కూడా వెనక్కు పంపించేశారని మండిపడ్డారు. తనను చూసి వైసీపీ ఎందుకంత భయపడుతోందని ప్రశ్నించారు పవన్.


80శాతం అంటే ఇదేనా..?

విశాఖ అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఒక్కో బోటు ఖరీదు రూ.25లక్షలు ఉంటుందని ప్రభుత్వం 80శాతం పరిహారం ఇస్తామన్నదని, అంటే దాదాపు రూ.15లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని, కానీ చివరకు రూ.7లక్షలు చేతిలో పెట్టారని విమర్శించారు పవన్. 80శాతం ఇచ్చామని ఆర్భాటంగా ప్రకటించి 5నుంచి 7 లక్షలే ఇస్తుంటే మిగిలిన డబ్బు ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఏం జరుగుతోందో మత్స్యకారులే ఆలోచించాలన్నారు.

రూ.150 కోట్లతో జెట్టీలను ఆధునికీకరిస్తామని నాలుగేళ్ల క్రితం వైసీపీ నేతలు చెప్పారని, కనీసం జెట్టీలో లైట్లు కూడా ఏర్పాటు చేయలేకపోయారని మండిపడ్డారు పవన్. జాతీయ మత్స్యకార యువజన పథకం కింద కేంద్రం రూ.1,850 కోట్లతో 37 ప్రాజెక్టులు రాష్ట్రానికి ఇస్తే.. ఏం చేశారని ప్రశ్నించారు. మత్స్యకారులు వైసీపీ నేతల్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.

విశాఖలో జగన్‌ ఉండేందుకు రుషికొండను తొలిచేసి ప్యాలెస్‌ నిర్మించుకుంటున్నారని, ఉన్న రాజభవనాలు ఆయనకు సరిపోవా? అని ప్రశ్నించారు పవన్. జగన్ విలాసాలకు పెట్టే రూ.433 కోట్లతో ఓ హార్బర్‌ నిర్మించొచ్చని అన్నారు. అలా చేస్తే 10వేల మంది మత్స్యకారుల జీవితాలు బాగుపడతాయని చెప్పారు.

దండుపాళ్యం గ్యాంగ్ లు..

నాలుగున్నరేళ్లుగా హార్బర్‌ లో, ఏపీలో వైసీపీ దోపిడీ ఎక్కువైందని, ఇక నాలుగు నెలలే వారికి టైమ్ ఉందని చెప్పారు పవన్. ఎన్నికల తర్వాత భద్రతతో కూడిన హార్బర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు. ఈసారి 2శాతం ఓట్లతో ఓడిపోయామనే పరిస్థితి రాకూడదని, గెలిస్తే 25వేలు, 50వేల మెజారిటీ ఉండాలని పిలుపునిచ్చారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే దండుపాళ్యం గ్యాంగులు రెచ్చిపోతాయని, బోటు ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు పవన్.


First Published:  25 Nov 2023 1:54 AM GMT
Next Story