Telugu Global
Andhra Pradesh

రెచ్చగొట్టడం.. పారిపోవటమేనా?

తాజాగా ఇప్పటం గ్రామంలో ఇళ్ళను కూల్చేస్తున్నారనే ఆరోపణలపై గ్రామానికి వెళ్ళి పవన్ నానా రచ్చచేశారు. ప్రభుత్వంపై తెగించి పోరాడమన్నారు. పవన్ మాట విని రెచ్చిపోయిన కొందరిపై పోలీసులు కేసులు పెట్టారు. అయితే పిలుపిచ్చిన పవన్ మాత్రం అడ్రస్ లేరు.

రెచ్చగొట్టడం.. పారిపోవటమేనా?
X

'తెగించి పోరాడండి..మీకు మీ పవన్ కల్యాణ్ ఉన్నాడు'.. ఇది ఇప్పటం గ్రామం నుండి మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు తిరిగొచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు. ప్రభుత్వంపై తిరగబడండి..ప్రభుత్వంపై పోరాడండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప..వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో సహా పెకిలించేయటమే ధ్యేయంగా పోరాటాలు చేస్తున్నాను అంటు పవన్ పదేపదే రెచ్చగొడుతున్నారు.

ఏమి ఆలోచిస్తున్నారో తెలీదుకానీ రెగ్యులర్‌గా జనసేన నేతలు, కార్యకర్తలను, మామూలు జనాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ పవర్ స్టార్ మాటల ఉచ్చులో పడి అదే నిజమని భ్రమించి గొడవల్లోకి దిగుతున్న జనాలు మాత్రం కేసుల్లో ఇరుక్కుని నానా అవస్తలు పడుతున్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపుడు కూడా ఇలాగే చెప్పారు.

కార్మికులు, ఉద్యోగులంతా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తానంటేనే తాను రంగంలోకి దిగుతానని బహిరంగసభలోనే చెప్పారు. అయితే వాళ్ళెవరు పవన్ మాటలను నమ్మినట్లులేదు. అందుకనే పవన్ మళ్ళీ ఫ్యాక్టరీ వైపు తొంగిచూడలేదు. కోనసీమకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టినందుకు ఆందోళనలు మొదలయ్యాయి. ఈ విషయమై పవన్ మాట్లాడుతూ ప్రజాందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఉద్యమంగా మారుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ నిజమే అనుకుని పార్టీలోని కొందరు కాపు నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు.

అప్పుడు జరిగిన విధ్వంసంలో సుమారు 120 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఇపుడు వాళ్ళల్లో చాలా మంది ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈ మధ్యనే వైజాగ్‌లో జరిగిన ప్రజాగర్జనకు సంబంధించి మంత్రులపై పవన్ ఫుల్లుగా ఫైరయ్యారు. మరి జనసేన నేతలు, కార్యకర్తలకు ఏమర్ధమయ్యిందో ఏమో ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడులు చేశారు. దాంతో 115 మందిపై పోలీసులు కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు.

తాజాగా ఇప్పటం గ్రామంలో ఇళ్ళను కూల్చేస్తున్నారనే ఆరోపణలపై గ్రామానికి వెళ్ళి పవన్ నానా రచ్చచేశారు. అక్కడ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తిరగబడమని చెప్పారు. ప్రభుత్వంపై తెగించి పోరాడమన్నారు. పవన్ మాట విని రెచ్చిపోయిన కొందరిపై పోలీసులు కేసులు పెట్టారు. అయితే పిలుపిచ్చిన పవన్ మాత్రం అడ్రస్ లేరు. ఏదో ఒక సందర్భంగా జనాలను రెచ్చగొట్టడం అడ్రస్ లేకుండా పారిపోవటమే పవన్ పనిగా పెట్టుకున్నట్లున్నారు.

First Published:  7 Nov 2022 5:43 AM GMT
Next Story