Telugu Global
Andhra Pradesh

పవన్‌కు అసెంబ్లీ గేటు కూడా దాటే అర్హత లేదు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ ముందు పగటి కలలు కనడం మానుకోవాలని సూచించారు. గోదావరి జిల్లాలో వైసీపీ గెలిస్తే జనసేన పార్టీని మూసేసి వెళ్తావా..? అని సవాల్ విసిరారు.

పవన్‌కు అసెంబ్లీ గేటు కూడా దాటే అర్హత లేదు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

గత ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం విడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క స్థానం కూడా రాకుండా చేస్తానని పదే పదే మాట్లాడుతున్నారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నుంచి సెటైర్లు ప‌డుతున్నాయి.

గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవని వాడు గోదావరి జిల్లాల్లో ఒక్కచోట కూడా గెలవనివ్వనంటూ సవాల్ విసురుతుంటే నవ్వొస్తోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సెటైర్ వేశారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ముందు పగటి కలలు కనడం మానుకోవాలని సూచించారు. గోదావరి జిల్లాలో వైసీపీ గెలిస్తే జనసేన పార్టీని మూసేసి వెళ్తావా..? అని సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము పవన్ కళ్యాణ్‌కి ఉందా..? అంటూ ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం కాదు కదా.. కనీసం అతడికి అసెంబ్లీ గేటు కూడా దాటే అర్హత లేదని విమర్శించారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క స్థానం కూడా రాకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ ప్రగల్బాలు పలుకుతున్నాడని, ముందు జనసేన తరఫున ఆ జిల్లాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను వెతుక్కోవాల్సిన దుస్థితి ప‌వ‌న్‌ద‌ని ఎద్దేవా చేశారు.

First Published:  1 July 2023 11:52 AM GMT
Next Story