Telugu Global
Andhra Pradesh

పవన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమారం

చంద్రబాబు పల్లకీని మోయటానికి పవన్ తనతో పాటు కాపు సామాజికవర్గాన్ని సిద్ధం చేస్తున్నారంటు వ్యంగ్యంగా పోస్టులు కనబడతున్నాయి. అలాగే కామన్ సింబల్ లేనికారణంగా జనసేన అభ్యర్థులు కూడా టీడీపీ గుర్తు సైకిల్ మీదే పోటీ చేస్తారనే సెటైర్లు పేలిపోతున్నాయి.

పవన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమారం
X

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయాన్ని ప్రకటించటంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొందరపడినట్లు పార్టీలోనే చర్చ పెరిగిపోతోంది. రెండు పార్టీల మధ్య పొత్తుంటుందని అందరు అనుకుంటున్నదే. కానీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట‌యి రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్న సమయంలో పొత్తును అధికారికంగా పవన్ ప్రకటిస్తారని జనసేనలో చాలామంది ఊహించలేదు. పైగా చేసిన ప్రకటన కూడా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని చాలా మంది నేతలు అంటున్నారు.

టీడీపీతో పొత్తు విషయాన్ని లాంఛనంగా అయినా పార్టీలో పవన్ చర్చించకపోవటాన్ని గుర్తు చేస్తున్నారు. పవన్-నాదెండ్ల నిర్ణయం తీసేసుకుని ప్రకటించేశారట. కనీసం పార్టీ సమావేశాలు పెట్టి తన మనసులోని మాటను పవన్ చెప్పి అందరి ఆమోదం తీసుకునుంటే బాగుండేదని చాలా మంది అనుకుంటున్నారు. అయితే అలాంటిదేమీ లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అందరు ఆమోదించాల్సిందే అన్నట్లుగా పవన్ ఇప్పుడు మాట్లాడటాన్నే తప్పుపడుతున్నారు.

పైగా పవన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్ముదులిపేస్తున్నారు. చంద్రబాబు పల్లకీని మోయటానికి పవన్ తనతో పాటు కాపు సామాజికవర్గాన్ని సిద్ధం చేస్తున్నారంటు వ్యంగ్యంగా పోస్టులు కనబడతున్నాయి. అలాగే కామన్ సింబల్ లేనికారణంగా జనసేన అభ్యర్థులు కూడా టీడీపీ గుర్తు సైకిల్ మీదే పోటీ చేస్తారనే సెటైర్లు పేలిపోతున్నాయి. గాజు గ్లాసుపై సైకిల్ గుర్తును ముద్రించిన కార్టూన్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక కాపు సామాజికవర్గంలోని చాలామంది ప్రముఖులు పవన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ‘కాపు సోదరా మేలుకో’ అనే టైటిల్‌తో 5.03 నిముషాల వీడియో సాంగ్ బాగా పాపులరైంది.

ఈ వీడియో సాంగ్‌ మొత్తం పవన్ నిర్ణయాన్ని తప్పుపడుతునే ఉంది. కాపులకు చంద్రబాబు చేసిన ద్రోహం, ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుటుంబం పట్ల చంద్రబాబు వ్యవహరించిన విధానం తదితరాలపై వివరించారు. ఈ పాట కాపు సామాజికవర్గంలో బాగా పాపులరైపోయింది. పైగా వీడియో సాంగ్‌కు మద్దతుగా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూసిన తర్వాత టీడీపీకి మద్దతిచ్చే విషయంలో పవన్ తొందరపడ్డారా అనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. మరి పవన్ ఆలోచన కరెక్టా? లేకపోతే సామాజికవర్గంలోని ప్రముఖుల అభిప్రాయాలు కరెక్టా అన్న‌ది ఎన్నికలయితే కానీ తేలదు.


First Published:  19 Sep 2023 5:42 AM GMT
Next Story