Telugu Global
Andhra Pradesh

కోర్టులపైన కోపాన్ని జగన్‌పైన తీర్చుకుంటున్నారా..?

పవన్, లోకేష్, భువనేశ్వరితో పాటు తమ్ముళ్లు, ఎల్లోమీడియా మొత్తం అరెస్టు అక్రమమనే గోల చేస్తున్నాయి. సమన్వయ కమిటి సమావేశం తర్వాత పవన్, లోకేష్ మాట్లాడుతూ కోర్టులపైన తమ అక్కసంతా వెళ్ళగక్కారు.

కోర్టులపైన కోపాన్ని జగన్‌పైన తీర్చుకుంటున్నారా..?
X

`అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు` అనే సామెత చాలా పాపులర్. అచ్చంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాటల్లో అదే వినబడుతోంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టయి ఇప్పటికి 47 రోజులైంది. అరెస్టు వరకే సీఐడీ చేసింది. బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. చంద్రబాబు అరెస్టు అక్రమమని కోర్టు భావిస్తే వెంటనే బెయిల్ ఇచ్చేస్తుందనటంలో సందేహం లేదు. చంద్రబాబు అరెస్టు సక్రమమే అని, అరెస్టుకు కావాల్సిన అన్నీ ఆధారాలు ఉన్నాయని కోర్టులు కూడా ఏకీభవించటంతోనే బెయిల్ దక్కలేదు.

బెయిల్ పిటీషన్లు, మధ్యంతర బెయిల్ పిటీషన్లు, ముందస్తు బెయిల్ పిటీషన్లు వేసినా చంద్రబాబుకు ఊరట ల‌భించ‌డం లేదు. ఏసీబీ కోర్టు తర్వాత హైకోర్టు ఆ పైన సుప్రీంకోర్టులో ఎన్ని పిటీషన్లు వేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. అత్యంత ఖరీదైన లాయర్లు రోజుల తరబడి వాదించినా ఫలితం దక్కటంలేదు. అంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, అందుకు సీఐడీ చూపించిన సాక్ష్యాధారాలతో కోర్టులు ఏకీభవించాయని అర్థ‌మవుతోంది.

అయితే పవన్, లోకేష్, భువనేశ్వరితో పాటు తమ్ముళ్లు, ఎల్లోమీడియా మొత్తం అరెస్టు అక్రమమనే గోల చేస్తున్నాయి. సమన్వయ కమిటి సమావేశం తర్వాత పవన్, లోకేష్ మాట్లాడుతూ కోర్టులపైన తమ అక్కసంతా వెళ్ళగక్కారు. అరెస్టు అక్రమమని అంటున్న వీళ్ళు కోర్టుల్లో ఎందుకు బెయిల్ ఇవ్వటం లేదనే విషయాన్ని మరచిపోతున్నారు. అరెస్టు అక్రమం సరే మరి రిమాండు సంగతి ఏమిటి..? రిమాండు విధించింది, పొడిగిస్తున్నది, పిటీషన్లను డిస్మిస్ చేస్తున్నదంతా కోర్టులే కదా. అరెస్టు అక్రమం అంటే కోర్టు పరిధిలో జరుగుతున్న విచారణను వీళ్ళు తప్పుపడుతున్నట్లే.. చంద్రబాబును అక్రమంగా జైలులో ఉంచారన్న పవన్ ఆరోపణలకు అర్థ‌మేంటి..?

చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేకపోతున్న వీళ్ళు చివరకు కోర్టులను కూడా తప్పుపట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన తీర్పులపై వీళ్ళ ఎన్నోసార్లు హర్షం వ్యక్తం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అవే కోర్టులు చంద్రబాబు పిటీషన్లను డిస్మిస్ చేస్తుండటంతో తట్టుకోలేకపోతున్నారు. అంటే తమకు అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తే న్యాయం జరిగినట్లు, వ్యతిరేకంగా తీర్పులిస్తుంటే అంతా అక్రమమే అన్నట్లుగా ఉంది వీళ్ళ వ్యవహారం. కోర్టులను డైరెక్టుగా అనే ధైర్యంలేని పవన్, లోకేష్ ఆ కోపమంతా జగన్ పైన తీర్చుకుంటున్నారు.

First Published:  24 Oct 2023 4:26 AM GMT
Next Story