Telugu Global
Andhra Pradesh

సింబలే జనసేనకు సమస్యగా మారిందా?

2019 ఎన్నికలో జ‌న‌సేన పార్టీ అభ్యర్ధులందరికీ కేంద్ర ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. అయితే ఆ ఎన్నికల్లో అవసరమైన ఓట్లు తెచ్చుకోవటంలో పార్టీ ఫెయిలైంది. దాంతో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ లిస్టులో పెట్టేసింది.

సింబలే జనసేనకు సమస్యగా మారిందా?
X

ఒక రాజకీయ పార్టీ జనాల్లోకి బాగా ఎక్కాలంటే దాని ఎన్నికల గుర్తు కీలకపాత్ర పోషిస్తుంది. ఒక‌ప్పుడు ఆవు-దూడ ఇప్పుడు హస్తం కాంగ్రెస్ గుర్తు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్. వైసీపీ గుర్తు ఫ్యాన్, బీజేపీ గుర్తు కమలం పువ్వు. డీఎంకే సింబల్ ఉదయించే సూర్యుడు. ఇలాంటి అనేక పార్టీలను జనాలందరు వాటి గుర్తులతోనే ఐడెంటిఫై చేస్తారు. ఎన్నికల సమయంలో ఇంతటి కీలకపాత్ర పోషించే గుర్తు విషయంలోనే జనసేన పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీకి కాఫీ లేదా టీ తాగే గాజు గ్లాసు గుర్తును ఎంపిక చేసుకున్నారు. నిజానికి ఈ గుర్తు కూడా జనాలందరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేది. ఏ టీ షాపుకు వెళ్ళినా, హోటల్ కు వెళ్ళినా ఇలాంటి గ్లాసుల్లోనే టీ, కాఫీ ఇస్తుంటారు. ఇంతటి కీలకమైన గుర్తుమీద వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది అనుమానంగా మారింది. పార్టీకి ఎప్పటికప్పుడు ఈ గుర్తు ఇబ్బందులను తెస్తూ ఉంది.

మొదటగా 2019 ఎన్నికలో పాల్గొన్నపుడు ప్రత్యేకమైన అభ్యర్ధన కింద అభ్యర్ధులందరికీ కేంద్ర ఎన్నికల కమిషన్ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. అయితే ఆ ఎన్నికల్లో అవసరమైన ఓట్లు తెచ్చుకోవటంలో పార్టీ ఫెయిలైంది. దాంతో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ లిస్టులో పెట్టేసింది. గడచిన మూడు ఉపఎన్నికల్లోను గాజు గ్లాసు గుర్తు మీద ఇండిపెండెంట్ అభ్యర్ధులు పోటీ చేశారు. ఈ విషయమై పవన్ ఎన్నికల కమిషన్‌కు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేన గుర్తింపు పార్టీగా మారేంత వరకు ప్రత్యేకమైన గుర్తంటు ఒకటి ఉండదని కమిషన్ తేల్చిచెప్పింది.

ఫ్రీ సింబల్స్ లో ఎవరు ముందుగా నామినేషన్ వేసి ఏ గుర్తును అయితే తీసుకుంటారో ఆ గుర్తును కేటాయించేస్తామని క్లారిటీ ఇచ్చింది. ఆ విధంగా ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాసు గుర్తుపైన ముగ్గురు ఇండిపెండెంట్లు పోటీ చేశారు. ఇదే నిబంధన వచ్చే ఎన్నికల్లో కూడా వర్తించటం ఖాయం. మరపుడు జనసేన అభ్యర్ధులందరికీ గాజు గ్లాసు గుర్తు రాకపోతే పరిస్దితి ఏమిటి? కొందరికి గాజు గ్లాసు సింబల్ వచ్చి మరికొందరికి రాకపోతే అభ్యర్ధుల గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతుందనటంలో సందేహం లేదు. మరీ విషయంలో పవన్ ఏం చేస్తారో చూడాల్సిందే.

First Published:  28 Oct 2022 9:52 AM GMT
Next Story