పార్టీల ఆధిపత్యపోరు.. మీడియా వార్
ఏపీలో అధికార, విపక్షాల రాజకీయం ఎత్తులకి పైఎత్తులుగా సాగుతోంది. ఇన్నాళ్లూ విమర్శలు, ప్రతివిమర్శలు పాలనపైనా, ప్రభుత్వంపైనా, ప్రతిపక్షం వైఫల్యంపైనా ఇరువైపుల నుంచి సాగేవి.

ఏపీలో అధికార, విపక్షాల రాజకీయం ఎత్తులకి పైఎత్తులుగా సాగుతోంది. ఇన్నాళ్లూ విమర్శలు, ప్రతివిమర్శలు పాలనపైనా, ప్రభుత్వంపైనా, ప్రతిపక్షం వైఫల్యంపైనా ఇరువైపుల నుంచి సాగేవి. ఇప్పుడు యుద్ధరీతి మారింది. పార్టీలు మీడియా వార్‌కి తెరలేపాయి.
ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశంలో ఏ మీడియా సంస్థ చూసుకున్నా ఏదో ఒక పార్టీ అధినేతతో, ఆ పార్టీకి అనుకూలమైన సంస్థే అయ్యుంటుంది. అయితే ఏపీలో అధికార వైసీపీ-ప్రతిపక్ష టిడిపి మధ్య మాటల యుద్ధం వారికి కొమ్ముకాసే మీడియా మీదకు మళ్లింది.
టిడిపికి మద్దతుగా తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈటీవీ-ఈనాడు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5లను టిడిపితో కలిపి దుష్టచతుష్టయం అంటూ విరుచుకుపడుతున్నారు. పార్టీ సమావేశం అయినా, ప్రభుత్వ సమీక్ష అయినా దుష్టచతుష్టయం ప్రస్తావన లేకుండా సీఎం ప్రసంగం ముగియడంలేదు.
టిడిపి వైపు నుంచి కూడా నారా లోకేష్ చాలారోజులుగా సాక్షిని మాత్రమే టార్గెట్ చేసేవారు. ఏ మీటింగ్, ప్రెస్‌మీట్ అయినా సాక్షి రాలేదా? అంటూ సెటైర్లు వేసేవారు. ఈ మధ్యకాలంలో నారా లోకేష్ కూడా వైసీపీ మద్దతు మీడియాపై నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
సాక్షితోపాటు టీవీ9ని మరోసాక్షి అని, ఎన్టీవీని సాక్షి2 అంటూ మాటల తూటాలు వదులున్నారు. వైసీపీ-టిడిపి పోరుని అటుఇటు మద్దతుగా నిలుస్తోన్న మీడియా మీదకి డైవర్ట్ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీడియా సంస్థలు కూడా తమపై చేస్తున్న ఆరోపణలని ఖండించకపోవడంతో ఏ పార్టీ లైను ఎవరు తీసుకున్నారో కూడా స్పష్టం అవుతోంది. ఏ పార్టీ మీడియా సంస్థ ఏది అనేది మామూలు జనాలకి కన్ఫ్యూజన్ లేకుండా అధినేతల తమ మాటల ద్వారా తమ మీడియా ఏది, ప్రత్యర్థి మీడియా ఏది అనేది క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో అధికారవిపక్షాల మధ్య ఎల్లో మీడియా, బులుగు మీడియాగా వార్ షురూ అయ్యింది.