Telugu Global
Andhra Pradesh

పోరంబోకు స్థలాల్లో వారు, ఆర్టీసీ జాగాలో వీరు.. తగ్గేదే లేదు

వైసీపీ కార్యాలయంపై విమర్శలు చేస్తున్నారు కాబట్టి సాక్షి రంగంలోకి దిగింది. టీడీపీ అనుకూల మీడియాలో బ్యానర్ ఐటమ్ గా వస్తున్న బాపట్ల ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సాక్షిలో చోటు లేదు కాబట్టి.. అక్కడ మరో వ్యవహారం హైలెట్ అవుతోంది.

పోరంబోకు స్థలాల్లో వారు, ఆర్టీసీ జాగాలో వీరు.. తగ్గేదే లేదు
X

బాపట్లలో ఆర్టీసీ స్థలాన్ని కబ్జాచేసి వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారనేది టీడీపీ ఆరోపణ. ఆ స్థలం కబ్జా చేయలేదు, దర్జాగా ప్రభుత్వం నుంచి లీజుకి తీసుకున్నామనేది వైసీపీ వివరణ. ఈ గొడవ ఎలా ఉన్నా.. అక్కడ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మాత్రం తమ స్థలంలో పార్టీ ఆఫీస్ నిర్మాణం వద్దంటూ నిరసనకు దిగారు. ఆర్టీసీ ప్రత్యేక కార్పొరేషన్ గా ఉన్నప్పుడు ఇలాంటి ఆందోళనలు, నిరసనలు చెల్లుబాటవుతాయేమో కానీ, ఉద్యోగులంతా ప్రభుత్వంలో చేరి, సంస్థ లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటున్నప్పుడు.. ఆస్తుల విషయంలో ప్రభుత్వం హక్కుని ఒప్పుకోవాల్సిందే. వైసీపీ నేతలు ఈ లాజిక్ బయటకు తీస్తున్నారు, కానీ ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం కుదరదంటున్నారు.

ఆర్టీసీకి ప్రత్యామ్నాయ స్థలం చూపెడతాం లేదా, పార్టీ కార్యాలయాన్ని వేరే చోటకి తరలిస్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చాక ఈ గొడవ సద్దుమణిగింది. అయితే ఈ వివరణతోపాటు.. టీడీపీ ఆఫీస్ లపై కూడా ఆయన విమర్శలు సంధించారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ స్థలం ఇప్పటికీ వివాదాల్లోనే ఉందన్నారాయన. పార్టీ ఆఫీస్ లకు స్థలాల కేటాయింపు విషయంలో చంద్రబాబు గతంలో ఓ విధానం తీసుకొచ్చారని దాన్నే తాము ఫాలో అవుతున్నామని చెప్పారు.

రంగంలోకి సాక్షి..

వైసీపీ కార్యాలయంపై విమర్శలు చేస్తున్నారు కాబట్టి సాక్షి రంగంలోకి దిగింది. టీడీపీ అనుకూల మీడియాలో బ్యానర్ ఐటమ్ గా వస్తున్న బాపట్ల ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు సాక్షిలో చోటు లేదు కాబట్టి.. అక్కడ మరో వ్యవహారం హైలెట్ అవుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బండమీద కమ్మపల్లె పంచాయతీలో ఐదెకరాల చెరువు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని, అందులో టీడీపీ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారని, దాన్ని గతంలోనే రెవెన్యూ అధికారులు అడ్డుకున్నా ఇంకా అక్కడ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, సాక్షిలో కథనాలు వస్తున్నాయి.

ఈ కథ, కథనాలు ఇక్కడితో ఆగవు. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. రాష్ట్రంలో టీడీపీ ఆఫీస్ లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏయే స్థలాలను ఆక్రమించారో తెలియజేస్తూ వైసీపీ అనుకూల మీడియా రంగంలోకి దిగుతుంది. ఇటు వైసీపీ ఆఫీస్ లపై టీడీపీ అనుకూల మీడియా ఆల్రడీ కన్నేసింది. అక్రమాలను వెలికి తీయడంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారే కానీ, ఎవ్వరూ తగ్గట్లేదు.

First Published:  20 Dec 2022 2:05 AM GMT
Next Story