Telugu Global
Andhra Pradesh

విభజన సమస్యలు, పోలవరం.. 8 ఏళ్లయినా ఏపీ నుంచి అవే డిమాండ్లు..

రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటికీ అదే తంతు. కేంద్రం కూడా పదే పదే అవే కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తుంది, ఇటు ఏపీనుంచి వెళ్లే నాయకులకు కూడా విన్నపాలు చేసి రావడం అలవాటుగా మారింది.

విభజన సమస్యలు, పోలవరం.. 8 ఏళ్లయినా ఏపీ నుంచి అవే డిమాండ్లు..
X

ఏపీ నుంచి సీఎం ఢిల్లీ వెళ్లారంటే.. మీడియాకు కొత్తగా ఏమీ చెప్పాల్సిన పనిలేదు. విభజన సమస్యలపై చర్చించారని, పోలవరం కోసం నిధులు అడిగారని ఊహించి రాసేసుకుంటారు విలేకరులు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటికీ అదే తంతు. కేంద్రం కూడా పదే పదే అవే కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తుంది, ఇటు ఏపీనుంచి వెళ్లే నాయకులకు కూడా విన్నపాలు చేసి రావడం అలవాటుగా మారింది. ఢిల్లీనుంచి సీన్ మారినా, ఏపీనుంచి వెళ్లే వినతుల్లో కూడా మార్పులు లేవని మరోసారి రుజువైంది. సెప్టెంబర్‌-3న తిరువనంతపురంలో జరగబోతున్న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో కూడా ఏపీనుంచి ఇవే డిమాండ్లు వినిపించాలని నిర్ణయించారు సీఎం జగన్. ఈమేరకు క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

సెప్టెంబర్-3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగబోతోంది. దీనికి ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధుల బృందం హాజరు కాబోతోంది. ఈ సమావేశంలో ఏపీ తరపున వినిపించాల్సిన డిమాండ్లపై సీఎం జగన్ ఆధ్వర్యంలో చర్చ జరిగింది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లయినా సమస్యలు పెండింగ్‌ లో ఉన్నాయని, దీన్ని జోనల్‌ కమిటీ సమావేశంలో ప్రస్తావిస్తూ, వీటి పరిష్కారంకోసం డిమాండ్ చేయాలని సీఎం జగన్‌ సూచించారు. పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కోరాలన్నారు.

విభజన వల్ల ఏపీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్‌ లాంటి నగరాన్ని కోల్పోయిందని, విభజన సమస్యల పరిష్కారం ఆలస్యం అయ్యేకొద్దీ... రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని తెలిపారు సీఎం జగన్. అందుకే వీటి పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిందిగా సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని నేతలు, అధికారులకు హితబోధ చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి తగిన నిధులు విడుదల చేసే అంశాన్నికూడా అజెండాలో ఉంచాలని పేర్కొన్నారు. మొత్తమ్మీద విభజన జరిగి ఎనిమిదేళ్లవుతున్నా.. వేదికలు మారుతున్నాయే కానీ, ఏపీ నుంచి వినిపించే డిమాండ్లు మాత్రం మారడంలేదు.

First Published:  29 Aug 2022 11:23 AM GMT
Next Story