Telugu Global
Editor's Choice

కులాల కుంపటితో చలి కాచుకుంటున్నదెవరు?

రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యలను దారి మళ్లించి అందరూ 'కులం'బాట పట్టారు. ఇది ప్రణాళికా బద్ధంగానే జరుగుతోంది. కాకతాళీయంగా జరుగుతున్న ఘటనలు కావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంపట్లు ఇంత బాహాటంగా, నగ్నంగా కనిపించలేదు.

కులాల కుంపటితో చలి కాచుకుంటున్నదెవరు?
X

ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంపటితో రాజకీయ పార్టీలు చలి కాచుకుంటున్నాయి. మునుపెన్నడూ లేని ధోరణిలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి. కులాలను కేంద్రంగా చేసుకొని రాజకీయ లబ్ది పొందడానికి పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి.''చంద్రబాబు కమ్మ కనుక కమ్మ రైతులు అమరావతి కోసం భూములిచ్చారు. విజయవాడ కులపిచ్చికి పుట్టిల్లు. రాజధాని ఏర్పడితే మార్పు వస్తుంది'' అని ప్రముఖ దినపత్రిక యజమాని తన 'కాలమ్' లో రాయడం కుల రాజకీయాలకు అద్దం పట్టింది. ఈ వ్యాఖ్యలు అచ్చయి చాలా రోజులయ్యింది.

''లోకేశ్ ను ప్రజలపై రుద్ది, ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టీడీపీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి. రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని ఒక కులం పన్నాగాలు చేస్తోంది. ఎన్టీ రామారావు, వైఎస్ఆర్ కలిస్తే ఉండేంత దమ్ము సీఎం జగన్ కు మాత్రమే ఉంది'' అని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడానికి ఒక కులం పన్నాగం పన్నుతోంది'అంటే ఆ కులం ఏమిటో అందరికీ అర్థ‌మైపోయింది. అయితే అదే కులానికి చెందిన కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యమే! ముఖ్యమంత్రి జగన్ పట్ల విధేయతను ప్రకటించడానికి ఆయన ఈ మాటలు అని ఉండవచ్చు!

రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యలను దారి మళ్లించి అందరూ 'కులం'బాట పట్టారు. ఇది ప్రణాళికా బద్ధంగానే జరుగుతోంది. కాకతాళీయంగా జరుగుతున్న ఘటనలు కావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంపట్లు ఇంత బాహాటంగా, నగ్నంగా కనిపించలేదు. విభజన తర్వాత ఏపీలో పరిస్థితులు కులాల చుట్టే తిరుగుతున్నాయి. 2014 నుంచి రెడ్డి వర్సెస్ కమ్మ అనే ధోరణిలో పోరాటం సాగుతోంది. రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నందున ఆయనను కూలదోయడానికి కమ్మ కులం కుట్ర చేస్తుందన్నది కొడాలి నాని మాట‌ల్లో తాత్పర్యం.

2019 ఎన్నికలకు ముందు ఏలూరులో వైసీపీ నిర్వహించిన 'బీసీ డిక్లరేషన్' ప్రకారం అధికారం చేబట్టిన తర్వాత కులాల వారీగా కార్పోరేషన్లు స్థాపించారు. సుదీర్ఘకాలంగా బీసీలందరికీ కలిపి ఒకే కార్పోరేషన్ ఉండేది. ఆ తర్వాత కొన్ని ప్రధాన కులాల పేరుతో కార్పోరేషన్ల ఏర్పాటుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. 2019 నాటికి 13 కార్పోరేషన్లు, 9 ఫెడరేషన్లు ఉండేవి. జగన్ ప్రభుత్వం 56 కులాల కార్పోరేషన్లు ఏర్పాటు చేసింది. 56 మంది చైర్ పర్సన్లు, 672 మంది డైరక్టర్లను నామినేట్ చేశారు.

కులాల కార్పోరేషన్లు ఏర్పాటు చేసినా ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదన్న విమర్శలున్నవి. బీసీలకు పదవులు కట్టబెట్టామన్న పేరుతో వివిధ కులాలను రాజకీయంగా సమీకరించుకునే ప్రయత్నమే ఎక్కువగా జరుగుతోంది. బీసీలకు పదవుల్లో వాటా పెరిగింది. కానీ పెత్తనం దక్కలేదు. కాగా తెలుగుదేశం హయంలోనూ 'జయహో బీసీ' పేరిట సభలూ, సమ్మేళనాలూ జరిగాయి. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాలుగా టీడీపీ వెంట నడుస్తున్న బీసీలు జగన్ వైపునకు మరలారు. 2019 ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలు మెజార్టీగా ఉన్న చోట్ల వైసీపీ గెలిచింది.

'జయహో బీసీ'అనే నినాదం తమ పేటెంటుగా చంద్రబాబు అంటున్నారు. ఆ నినాదం ఆకర్షణీయంగా ఉన్నందున వైసీపీ వాడుకున్నది. నినాదాలకు, పేర్లకు పేటెంటు హక్కులు ఎందుకుంటాయి..? బీసీలకు జగన్ చేసిందేమీ లేదని, బీసీ మంత్రులంతా జగన్ ముందు చేతులు కట్టుకొని కూర్చుంటారని కొంత మసాలా జోడించి టీడీపీ అధ్యక్షుడు తన ప్రచారంలో చెబుతున్నారు. దీనిపై మంత్రి బొత్స సహా పలువురు వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుపై దండెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులూ, సీఎం పరస్పరం భుజాలపై చేతులు వేసుకొని తిరిగారా..? అని బొత్స ప్రశ్నించారు. మంత్రులకు అధికారాలు లేవని చంద్రబాబు చేస్తున్న విమర్శలపై కూడా బీసీ మంత్రులు మండిపడుతున్నారు. టీడీపీ పాలనలో మంత్రులకు ఇచ్చిన స్వేచ్ఛ, అధికారాల గురించి బహిర్గతం చేయాలని వారంటున్నారు.

ఇక ''బలహీనవర్గాల ప్రజలు స్వశక్తితో ఎదగడం ఇష్టం లేకనే జగన్ డబ్బులు పంచుతున్నారా''? అని అమరావతి కోసం ఒక సామాజిక వర్గం రైతులు భూములెందుకు త్యాగం చేశారో పరిశోధించిన దినపత్రిక యజమాని రాసిపారేశారు. జగన్ మోహన్ రెడ్డిని అత్యవసరంగా గద్దె దింపాలని కోరుకుంటున్న వారిలో సదరు మీడియా సంస్థ అధినేత కూడా ముఖ్యుడు. ఆయన చంద్రబాబు వదిలిన బాణమని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ తెలుసు. అయితే తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో బడుగు బలహీనవర్గాల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన నిర్వచించిన 'స్వశక్తితో ఎదగడం' అనే సిద్ధాంతం ఎటుపోయిందో తెలియదు.

''తెలంగాణ ప్రజలు నా తెలంగాణ అని రాష్ట్రం గురించి ఆలోచిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం నా కులం అంటూ కులం గురించి ఆలోచిస్తున్నారు. ఈ రకమైన ఆలోచనలు రాష్ట్రాన్ని తిరోగమనంలోకి నెట్టివేస్తాయి. జనసేన పార్టీ ఏ ఒక్క కులానికీ, మతానికీ సంబంధించినది కాదు''అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గత జూలైలో తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అన్నారు. ఏపీలో కుల జాడ్యం ఎంత పెరిగిపోయిందో ఆయన మాటలు తెలియజేస్తున్నవి. కానీ ఆచరణలో ఆ పార్టీలో ఒక కులానికే ప్రాధాన్యం పెరుగుతోందంటూ తిరుపతి సహా పలు నియోజకవర్గాల్లో విమర్శలున్నవి. ఒక కులం ప్రాధాన్యం పెరగడం వలన 'సేన' లో గ్రూపు రాజకీయాలు కూడా పుంజుకుంటున్నవి. పవన్ వ్యాఖ్యలు ఆదర్శంగా కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పార్టీని సొంతం చేసుకుంటున్న వాళ్ళు, ఆ పార్టీకి మద్దతిస్తున్నవారు ఏ 'కులాని'కి చెందిన వారో బహిరంగ రహస్యం. కనుక మాటలు వేరు. ఆచరణ వేరు.

అన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలకోసమే కులాలను ఎగదోస్తున్న విషయాన్ని పసిగట్టడం పెద్ద కష్టం కాదు.

First Published:  11 Dec 2022 2:32 AM GMT
Next Story