Telugu Global
Andhra Pradesh

పాదయాత్రలతో చంద్రబాబుపై ఒత్తిడి పెంచేస్తున్నారా?

అనంతపురం జిల్లాలోని రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వాల్సిందే అని తల్లీ, కొడుకులు పరిటాల సునీత, శ్రీరామ్ గట్టిగానే అడుగుతున్నారు. ఇందులో భాగంగానే సునీత పాదయాత్ర మొదలుపెట్టేశారు.

పాదయాత్రలతో చంద్రబాబుపై ఒత్తిడి పెంచేస్తున్నారా?
X

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రెండు టికెట్లు సాధించుకోవాల్సిందే అన్న పట్టుదలతో పరిటాల కుటుంబం చంద్రబాబునాయుడుపై బాగా ఒత్తిడి పెంచేస్తున్నారు. వచ్చేఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాకేజీలు ఉండవని చంద్రబాబు ఎంత గట్టిగా చెబుతున్నా సీనియర్ నేతలు చాలా మంది పట్టించుకోవటంలేదు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో టికెట్లు ఇవ్వాల్సిందే అని తల్లీ, కొడుకులు పరిటాల సునీత, శ్రీరామ్ గట్టిగానే అడుగుతున్నారు. ఇందులో భాగంగానే సునీత పాదయాత్ర మొదలుపెట్టేశారు.

రాప్తాడు నియోజకవర్గంలో జనాలను ముఖ్యంగా రైతాంగాన్ని కలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా జనాల సమస్యలను డైరెక్టుగా తెలుసుకోవచ్చని సునీత చెబుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే తాను పాదయాత్ర చేస్తున్నట్లు చెబుతున్న సునీత వచ్చే ఎన్నికల్లో రాప్తాడులో పోటీ చేయటం ఖాయమంటున్నారు. తాను రాప్తాడులోను తన కొడుకు శ్రీరామ్ ధర్మవరంలోను పోటీ చేస్తామని నేతలకు బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు కుదరదని అంటున్నా పరిటాల ఫ్యామిలీ లెక్కచేయటం లేదు.

పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే సునీత పాదయాత్ర అయిపోగానే ధర్మవరంలో శ్రీరామ్ పాదయాత్ర మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నారట. ఒకేసారి ఇద్దరూ పాదయాత్రలు చేయాలంటే రూట్ మ్యాప్‌ను ఫాలో అవటం కష్టం కాబట్టి ప్రస్తుతం సునీత మాత్రమే పాదయాత్ర చేస్తున్నారట. రాప్తాడులో సునీతకు టికెట్ ఓకేనే. కానీ ధర్మవరంలో శ్రీరామ్‌కు టికెట్ అంటేనే చంద్రబాబు ఒప్పుకోవటంలేదు. నియోజకవర్గం ఇన్‌చార్జి హోదాలో తనకు కాకుండా టికెట్ ఇంకెవరికి ఇస్తారన్న పరిటాల మాటకు చంద్రబాబు జవాబివ్వటంలేదట.

ఇక్కడే పరిటాల కుటుంబానికి చంద్రబాబు మీద అనుమానాలు పెరిగిపోతున్నట్లు టాక్. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత పార్టీని వదిలేసి వెళిపోయిన వరదాపురం సూరిని మళ్ళీ చేర్చుకుని టికెట్ ఇస్తారేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయట. అందుకనే నియోజకవర్గంలో తనకు ఎదురులేదని చాటుకునేందుకు శ్రీరామ్ కూడా పాదయాత్ర ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేఈ, పూసపాటి, జేసీ, చింతకాయల, కళా, భూమా ఇలా చాలా కుటుంబాలు ఫ్యామిలీ ప్యాకేజీలకు పట్టుబడుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

First Published:  21 Nov 2022 6:11 AM GMT
Next Story