Telugu Global
Andhra Pradesh

ప‌ర్చూరు వైసీపీ ఇన్‌చార్జి.. చీరాల ఇండిపెండెంట్‌గా వేస్తాడా..?

ప‌ర్చూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే టిడిపికి చెందిన ఏలూరి సాంబ‌శివ‌రావును ఢీకొట్ట‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. 2019 వైసీపీ వేవ్ లోనూ ఈ సీటు టిడిపియే గెలిచింది. చీరాల‌తో పోల్చితే ఆమంచి ప‌ర్చూరుకి నాన్ లోక‌ల్ లెక్కే.

ప‌ర్చూరు వైసీపీ ఇన్‌చార్జి.. చీరాల ఇండిపెండెంట్‌గా వేస్తాడా..?
X

ఏపీ రాజ‌కీయాల్లో వివాదాస్ప‌ద రాజ‌కీయ‌వేత్త‌ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ రాజ‌కీయ భ‌విత‌వ్యం అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది. గెలిచే పార్టీ, ఓడే పార్టీ, స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఆమంచి కెరీర్ సాగింది. ఇప్ప‌టికీ తాను కోరుకున్న‌ది ఒక‌టైతే, పార్టీ అధిష్టానం అప్ప‌గించింది మ‌రొక‌టి కావ‌డంతో ఏ నిర్ణ‌యం తీసుకోవాలో తెలియ‌ని గంద‌ర‌గోళంలో ఉన్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ చీరాల అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, త‌న రాజ‌కీయ గురువు రోశ‌య్య సీఎం కావ‌డంతో ఎదురులేని విధంగా దూసుకుపోయారు. రోశ‌య్య దిగిపోవ‌డం, రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆమంచి స్పీడ్ త‌గ్గింది. ఇసుక దందా, సిలికా ఇసుక ర‌వాణా, గొడ‌వ‌ల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా నిత్య‌మూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు.

2014లో న‌వోద‌యం పార్టీ పేరుకే గానీ ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలుపొందారు. అనంత‌రం అధికార టిడిపిలో చేరారు. 2019 ఎన్నిక‌ల‌కు వైసీపీలో చేరి చీరాల అభ్య‌ర్థిగా నిలిచి టిడిపి అభ్య‌ర్థి క‌ర‌ణం బ‌ల‌రాం చేతిలో ఓడిపోయారు. అయితే అనూహ్యంగా క‌ర‌ణం బ‌ల‌రాం కూడా వైసీపీ గూటికి చేర‌డంతో ఆమంచికి దిక్కుతోచ‌లేదు. ఇంత‌లో చీరాల వైసీపీ ఇన్చార్జిగా బ‌ల‌రాం త‌న‌యుడు క‌ర‌ణం వెంక‌టేశ్‌ని ప్ర‌క‌టించారు. ఏళ్లుగా తాను రాజ‌కీయాలు న‌డిపిన చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న‌ను దూరం చేస్తున్నార‌ని అర్థ‌మైనా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో కృష్ణ‌మోహ‌న్ ఉన్నారు. వైసీపీ ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు ఆమంచికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప్ప‌గించారు. అయితే ఆ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం ఇష్టంలేని ఆమంచి అన్య‌మ‌న‌స్కంగానే ఉన్నారు.

ప‌ర్చూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే టిడిపికి చెందిన ఏలూరి సాంబ‌శివ‌రావును ఢీకొట్ట‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. 2019 వైసీపీ వేవ్ లోనూ ఈ సీటు టిడిపియే గెలిచింది. చీరాల‌తో పోల్చితే ఆమంచి ప‌ర్చూరుకి నాన్ లోక‌ల్ లెక్కే. చీరాల‌లో ఉన్న కుల‌బ‌ల‌మూ ప‌ర్చూరులో ఆమంచికి క‌లిసి రాదు. మొత్తం ఈ స‌మీక‌ర‌ణాల‌న్నీ చూసుకున్న ఆమంచి, ప్ర‌స్తుతం మౌనంగా ఉన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కూ ఇదే స్ట్రాట‌జీ మెయింటెన్ చేస్తారు. త‌న‌పై ఉన్న‌ కేసులు విష‌యంలో అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా వైసీపీలోనే కొన‌సాగుతార‌ని విశ్లేష‌కుల మాట‌. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా చీరాల నుంచి ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగుతార‌ని ఆయ‌న ఆంత‌రంగికులు చెబుతున్న మాట‌.

First Published:  3 Jan 2023 2:23 PM GMT
Next Story