Telugu Global
Andhra Pradesh

'ఏపీ ప‌ట్ల మా నిబ‌ద్ధ‌త ఎన్న‌టికీ చెద‌ర‌దు..' జోడో యాత్ర లో రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల త‌మ నిబ‌ద్ధ‌త ఎన్న‌టికీ చెద‌ర‌ద‌ని రాహుల్ గాంధీ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా, అమ‌రావ‌తి రాజ‌ధానిగా అభివృద్ధి చేసేందుకు త‌మ పార్టీ క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు.

ఏపీ ప‌ట్ల మా నిబ‌ద్ధ‌త ఎన్న‌టికీ చెద‌ర‌దు.. జోడో యాత్ర లో రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
X

భార‌త్‌ జోడో యాత్ర‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాహుల్ గాంధీ జ‌రిపిన పాద యాత్రలోఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఈ పాద యాత్ర త‌న‌కు మ‌ర‌పురాని అనుభూతి ఇచ్చింద‌ని అన్నారు. ఇక్క‌డ ప్ర‌జ‌లు త‌న ప‌ట్ల చూపిన అపార‌మైన ఆద‌ర‌ణ‌, ఆప్యాయ‌త‌లు, మ‌ద్ద‌తుకు ధ‌న్య‌వాదాలు చెప్పారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల త‌మ నిబ‌ద్ధ‌త ఎన్న‌టికీ చెద‌ర‌ద‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా, అమ‌రావ‌తి రాజ‌ధానిగా అభివృద్ధి చేసేందుకు త‌మ పార్టీ క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే విభ‌జ‌న హ‌మీల‌ను అమ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌రించే కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా చేస్తున్న నిర‌స‌న‌ల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న హ‌మీల‌ను అమ‌లు చేయ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం, అమ‌లు చేయించ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌య్యాయ‌ని విమ‌ర్శించారు.

గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా నిలిచి ఎంతోమంది రాజ‌నీతిజ్ఞుల‌ను అందించింద‌న్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల హృద‌యాల‌లో ఇప్ప‌టికీ కాంగ్రెస్‌ పార్టీ ఉంద‌ని అన్నారు. వారి ఆద‌ర‌ణ‌తో తిరిగి పార్టీని పునరుజ్జీవింప‌చేసేందుకు తాము గ‌ట్టిగా కృషి చేస్తామ‌ని చెప్పారు. అందుకు ఈ భార‌త్ జోడో యాత్ర నాందీ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం దేశంలో నిరుద్యోగం, ఆక‌లి, అస‌మాన‌త‌లు, విద్వేషాలు తాండ‌విస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. ఆకాశాన్నంటే ధ‌ర‌లు, పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం సామాన్యుడి జీవితాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్నాయ‌న్నారు. ఈ ప‌రిస్థితులు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌న్నారు.రాష్ట్రంలో వైసిపి ప్ర‌భుత్వం పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేస్తోంద‌ని విమర్శించారు.

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను తెలుసుకునేందుకు వారి మాట‌లు వినేందుకే భార‌త్ జోడో యాత్ర చేస్తున్నామ‌ని చెప్పారు. ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా తాము ప్ర‌జ‌ల వాణిని వినిపిస్తూనే ఉంటామ‌ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు.

First Published:  21 Oct 2022 12:05 PM GMT
Next Story