Telugu Global
Andhra Pradesh

దుమారం రేపుతోన్న శ్రీవారి దర్శనాలు..!

రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు శ్రీ‌వాణి ట్రస్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని విశ్వహిందూ పరిషత్‌ ఆరోపించింది. టీటీడీపై నిరాధార ఆరోపణలు చేయడమంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని అభిప్రాయపడింది.

దుమారం రేపుతోన్న శ్రీవారి దర్శనాలు..!
X

టీటీడీ ధర్మ ప్రచారం దారితప్పుతోందనే విమర్శలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతున్నాయి. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గిరిజన, ఎస్సీ, మత్స్యకార, వెనుకబడిన గ్రామాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం చేపడుతోంది. కానీ ఇప్పుడా ట్రస్ట్‌ వివాదాలకు కేంద్రంగా మారుతోంది. పురాతన ఆలయాల పునరుద్ధరణ పట్ల స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చార‌కులు, స్వామీజీలు, పీఠాధిపతులు ప్రశంసలు కురిపిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయి.

శ్రీవాణి ట్రస్టులో అవినీతి జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ట్రస్ట్‌కు వస్తున్న నిధులు ఏమవుతున్నాయో లెక్క చెప్పాలన్నారు. వెంకటేశ్వరస్వామికి అపచారం చేస్తే పుట్టగతులు ఉండవని శాపాలు పెడుతున్నారు. రూ.500 ఉన్న బ్రేక్ దర్శనం టికెట్లను శ్రీవాణి ట్రస్ట్ పేరిట రూ.10వేలు చేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. తాను టికెట్ కొనుగోలు చేసినా రశీదు ఇవ్వలేదన్నారు. శ్రీవాణి ట్రస్ట్ పేరిట వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియడం లేదన్నారు. ట్రస్ట్ డబ్బులను టీటీడీ చైర్మ‌న్‌ వైవీ సుబ్బారెడ్డి తన అకౌంట్‌లో వేసుకుని, సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు.

కాగా.. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు శ్రీ‌వాణి ట్రస్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని విశ్వహిందూ పరిషత్‌ ఆరోపించింది. టీటీడీపై నిరాధార ఆరోపణలు చేయడమంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని అభిప్రాయపడింది. శ్రీవాణి ట్రస్టు అకౌంట్లను పరిశీలించామని, ఒక్క పైసా కూడా దుర్వినియోగం జరగలేదని విశ్వహిందూ పరిషత్ ప్ర‌తినిధులు చెప్పారు. ఎవరికైనా సందేహాలుంటే శ్రీవాణి ట్రస్టు రికార్డులను, అకౌంట్లను పరిశీలించుకోవచ్చన్నారు. నిరాధారమైన ఆరోపణలను నమ్మవద్దని టీటీడీ ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో 8.25 లక్షల మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.

తాజాగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి శ్రీవాణి ట్రస్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. దళారీ వ్యవస్థని అరికట్టేందుకే శ్రీవాణి ట్రస్ట్‌లో దర్శన విధానాన్ని ప్రారంభించామన్నారు. ట్రస్ట్‌కి ఇప్పటి వరకు రూ.861 కోట్లు విరాళాలు అందాయని, రూ.603 కోట్లు బ్యాంకులో డిపాజిట్లు చేశామని చెప్పారు. వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ.139 కోట్ల నిధులు వచ్చాయన్నారు. డిపాజిట్లపై రూ.36 కోట్లు వడ్డి వచ్చింద‌ని, ఆలయాల నిర్మాణం కోసం రూ.120 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో 127 పురాతన ఆలయాల పునరుద్ధరణ చేపట్టామన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1,953 ఆలయాలు, సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా 320 ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. మరి వైవీ సుబ్బారెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  23 Jun 2023 7:20 AM GMT
Next Story