Telugu Global
Andhra Pradesh

రాష్ట్రాన్ని ముంచెత్తబోతున్న యాత్రలు.. జగన్‌కు పెద్ద పరీక్షేనా?

ప్రతిపక్షాలన్నీ యాత్రలు చేస్తుంటే వెనకబడిపోతామనే భయంతో సీపీఎం రంగంలోకి దూకకుండా ఉంటుందా? మ‌రి ఇన్ని యాత్రలను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది.

రాష్ట్రాన్ని ముంచెత్తబోతున్న యాత్రలు.. జగన్‌కు పెద్ద పరీక్షేనా?
X

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగిపోతోంది. మామూలుగా వరదలు లేదా తుపానులు రాష్ట్రాన్ని ముంచెత్తుతాయి. కానీ ఎన్నికల సీజన్ కదా అందుకనే యాత్రలు ముంచెత్తబోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే జనవరి 26 నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు మొదలవ్వబోతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రకటించారు. కాంగ్రెస్ తరపున సీనియర్ నేతలంతా తమ ప్రాంతాల్లో రెండు నెలల పాటు పాదయాత్రలు చేయటానికి రెడీ అవుతున్నారు.

ఇప్పటికే టీడీపీ తరపున నారా లోకేష్ జనవరి 27 నుండి పాదయాత్ర చేయటానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కుప్పంలో మొదలయ్యే పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగియబోతోంది. ఏడాది పాటు సుమారు 4 వేల కిలోమీటర్ల యాత్ర చేయాలని లోకేష్ డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో కాస్త అటు ఇటుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో వారాహి యాత్ర మొదలవబోతోందని అంటున్నారు. ముచ్చటపడి చేయించుకున్న వారాహి వాహనంలో రాష్ట్రాన్ని చుట్టేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

అంటే ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు టీడీపీ పాదయాత్రలు మొదలవ్వబోతున్నాయి. కొంచెం అటు ఇటుగా పవన్ యాత్ర కూడా మొదలవుతుంది. మూడు వైపులా కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలు యాత్రల పేరుతో నెలల తరబడి జనాల్లోనే ఉండబోతున్నారు. బీజేపీ తరపున పాదయాత్రలు చేసే అవకాశాన్ని కమలనాథులు కూడా పరిశీలిస్తున్నారట. సీపీఐ రామకృష్ణ నాయకత్వంలో యాత్రకు కోర్టు ద్వారా ప‌ర్మిష‌న్ తీసుకున్నారు.

ఇవన్నీ సరిపోవన్నట్లుగా అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలనే డిమాండ్‌తో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగే అవకాశముందంటున్నారు. దాదాపు నెల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. జనవరిలో లోకేష్ పాదయాత్రకు మద్దతుగా తూర్పుగోదావరి జిలాలో ఆగిపోయిన చోట నుండే జేఏసీ పాదయాత్ర కూడా మొదలయ్యే అవకాశాలున్నాయట. ప్రతిపక్షాలన్నీ యాత్రలు చేస్తుంటే వెనకబడిపోతామనే భయంతో సీపీఎం రంగంలోకి దూకకుండా ఉంటుందా? మ‌రి ఇన్ని యాత్రలను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది.

First Published:  14 Dec 2022 4:50 AM GMT
Next Story