Telugu Global
Andhra Pradesh

తామొస్తే ఏంచేస్తామో.. టీడీపీ ట్రైలర్‌ చూపించేసిందిగా..

గచ్చిబౌలి సభకు అన్ని కులాలు, మతాలకు చెందినవారు, టీడీపీ సానుభూతిపరులు హాజరవగా, గెట్ టు గెదర్‌ కార్యక్రమానికి మాత్రం చంద్రబాబు సామాజికవర్గం వారిని మాత్రమే ఆహ్వానించారు.

తామొస్తే ఏంచేస్తామో.. టీడీపీ ట్రైలర్‌ చూపించేసిందిగా..
X

తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాసే పార్టీ అన్న అభిప్రాయం ఇప్పటికే సర్వత్రా ఉంది. మిగిలిన వర్గాల వారిని తమ పల్లకీ మోసేవారు గానే చూసే పరిస్థితి ఎప్పటికప్పుడు వారి చర్యల ద్వారా బ‌య‌ట‌ప‌డుతోంది. తాజాగా మరో ఘటన దానిని రుజువు చేసింది. అసలు విషయం ఏమిటంటే..


చంద్రబాబు జైలులో ఉన్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బాబుకు కృతజ్ఞత తెలియజేస్తూ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేయాలని భావించినా ఆ స్థాయిలో మాత్రం జనం రాలేదు. అయినా ఒక మేరకు జన సమీకరణ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్‌–చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో గెట్ టు గెదర్‌ నిర్వహించారు.

గచ్చిబౌలి సభకు అన్ని కులాలు, మతాలకు చెందినవారు, టీడీపీ సానుభూతిపరులు హాజరవగా, గెట్ టు గెదర్‌ కార్యక్రమానికి మాత్రం చంద్రబాబు సామాజికవర్గం వారిని మాత్రమే ఆహ్వానించారు. ఈ ఆత్మీయ సమావేశానికి వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు మినహా మరే ఇతర కులాలు, మతాల వారిని పిలవలేదని ఇప్పుడు దళిత, బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ నిర్వహణలో కేవలం బాబు సామాజిక వర్గం పాత్ర మాత్రమే లేదని, అందరి కృషీ ఉందని దళిత, బీసీ నాయకులు అంటున్నారు. అయినా కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే నారా–నందమూరి కుటుంబ సభ్యులు ఆహ్వానించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను కరివేపాకుల్లా తీసిపడేశారని మండిపడుతున్నారు.

అంటే అధికారాన్ని అనుభవించడానికి మాత్రం కమ్మ వాళ్లు, వారి పల్లకీలు మోయడానికి మాత్రమే తాము పనికి వస్తామా? అని వారు రగిలిపోతున్నారు. అధికారం రాకముందే ఇలావుంటే.. అధికారంలోకొచ్చాక తమ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతోందని ద‌ళిత‌, బీసీ నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసం వేదికలపై గొంతు చించుకుంటున్నవారు అన్ని వర్గాల్లోనూ ఉన్నారని, అయినా అలాంటివారెవరినీ ఆహ్వానించకపోవడమేంటని టీడీపీ సానుభూతిపరులైన బహుజన నేతలు మండిపడుతున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ.. తామొస్తే ఏం చేస్తామనేదానికి టీడీపీ చూపించిన ట్రైలర్‌ లాంటిదని పలువురు చెబుతున్నారు.

First Published:  9 Nov 2023 8:02 AM GMT
Next Story