Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్ ఘాట్ వేదికగా నందమూరి కుటుంబంలో లుకలుకలు

బాలయ్య ఆదేశాలతోనే జూనియర్ ఫ్లెక్సీలను తొలగించారనే అనుమానాలు బలపడ్డాయి. సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి తిట్టుకుంటున్నారు.

ఎన్టీఆర్ ఘాట్ వేదికగా నందమూరి కుటుంబంలో లుకలుకలు
X

నందమూరి కుటుంబంలో లుకలుకలు మళ్లీ బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో ఈ గొడవ బయటపడింది. ఘాట్ వద్ద ముందుగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వచ్చి నివాళులర్పించారు. వారు వచ్చే సమయంలో అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీలను అక్కడ ఉంచారు. ఆ తర్వాత బాలకృష్ణ వచ్చి వెళ్లారు. బాలయ్య వెళ్లిపోగానే ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కొందరు తొలగించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యారు. బాలయ్య ఆదేశాలతోనే జూనియర్ ఫ్లెక్సీలను తొలగించారనే అనుమానాలు బలపడ్డాయి. సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి తిట్టుకుంటున్నారు.


జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ చాన్నాళ్లుగా నారా కుటుంబం పావులు కదుపుతుందనే విషయం తెలిసిందే. చంద్రబాబు సభల్లో ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న రచ్చ, వారిని తన్ని తరిమేస్తున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు ఫొటోలతో ఫ్లెక్సీలు వేస్తే వాటిని ఎందుకు తీసేయాల్సి వచ్చిందనేదే అసలు ప్రశ్న. కనీసం ఆయన వర్థంతి రోజు కూడా కుటుంబ సభ్యులు కలసి ఒకేసారి ఘాట్ వద్దకు రాలేదు. ఎవరికివారే, యమునా తీరే అన్నట్టుగా ఉంది వ్యవహారం. వచ్చినా కూడా ఒకరంటే ఒకరికి గిట్టకపోవడం, ఇలా ఫ్లెక్సీలు తీసిపారేయడం చూస్తుంటే.. గొడవలు మరింత ముదిరాయని అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆయన్ను మరింతగా టార్గెట్ చేశారు. బాలకృష్ణ కూడా.. అన్న కొడుకుల కంటే, తన బావకి, అల్లుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలిసిందే. ఆమధ్య ఎన్టీఆర్ మౌనంపై.. బాలయ్య డోంట్ కేర్ అంటూ స్పందించి కలకలం రేపారు. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ నుంచి స్పందన లేదు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత అందరూ వెళ్లి పలకరించారు కానీ, హరికృష్ణ తనయులైన కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల కొత్త సినిమా విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కల్యాణ్ రామ్ ఏపీ రాజకీయాలపై మాట దాటవేశారు. ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేస్తామని కానీ, కనీసం టీడీపీకి మద్దతు తెలుపుతామని కానీ చెప్పలేదు. దీన్నిబట్టి.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, టీడీపీకి ఎంత దూరంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. హరికృష్ణ కుమార్తె సుహాసిని మాత్రం నారావారి టీమ్ లోనే ఉండటం విశేషం.

First Published:  18 Jan 2024 5:47 AM GMT
Next Story