Telugu Global
Andhra Pradesh

ఇక సజ్జల కనుసన్నల్లో వైసీపీ సోషల్ మీడియా

ఇన్నాళ్లూ వైఎస్ జగన్, వైసీపీ మీద అభిమానంతో కొంత మంది సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పని చేశారు. కానీ ఇకపై వారిని సంఘటితం చేసే చర్యలు తీసుకున్నారు.

ఇక సజ్జల కనుసన్నల్లో వైసీపీ సోషల్ మీడియా
X

ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్.. చవకగా దొరికే డేటా కారణంగా సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిపోయింది. ఈ ట్రెండ్ గమనించే చాలా రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్‌ను ఏర్పాటు చేశాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య జరిగే సోషల్ మీడియా వార్‌ను ప్రజలు ప్రతీ రోజు గమనిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పార్టీ ఆ విభాగంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అదే సమయంలో టీడీపీ సోషల్ మీడియాను విస్తృతంగా వాడింది. ప్రభుత్వంపై విమర్శలే కాకుండా అప్పడప్పుడు తప్పుడు ప్రచారాలతో జనాల్లోకి వెళ్లింది. ఒక్కోసారి ప్రభుత్వమే అది తప్పుడు ప్రచారం అని వివరణ ఇచ్చుకోవల్సి వచ్చేది. మరోవైపు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరించారు. నిజం చెప్పాలంటే.. మరీ శృతి మించి ఏకంగా హైకోర్టు జడ్జీల మీద కూడా ఇష్టారాజ్యంగా రాతలు రాసి చిక్కులు కొని తెచ్చుకున్నారు.

మరో రెండేళ్ల లోపే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియా దూసుకొని పోతోంది. జనసేన కార్యకర్తలు కూడా ఎప్పటికప్పుడు సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం కూడా తాము చేసిన తప్పును తెలుసుకున్నది. ఇన్నాళ్లూ వైఎస్ జగన్, వైసీపీ మీద అభిమానంతో కొంత మంది సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పని చేశారు. కానీ ఇకపై వారిని సంఘటితం చేసే చర్యలు తీసుకున్నారు. వారం రోజుల క్రితం తాడేపల్లిలోని ఓ స్టార్‌ హోట‌ల్‌లో సోషల్ మీడియా వర్క్ షాప్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంతా తానై ఆ వర్క్ షాప్‌ను నడిపించారు.

ఇప్పటి వరకు పార్టీ మీడియా విభాగాన్ని చూస్తున్న సజ్జలకే సోషల్ మీడియా విభాగపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తున్నది. వైసీపీ సోషల్ మీడియా వింగ్‌ను బలోపేతం చేయడంతో పాటు.. ఎలాంటి పోస్టులు పెట్టాలనే విషయంపై కూడా సజ్జల దిశానిర్దేశం చేయనున్నారు. వైఎస్ జగన్ ఇప్పటికే సజ్జల నియామకానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. గతంలో మాదిరిగా ఇష్టానుసారం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కేసుల్లో ఇరుక్కోకుండా అందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

గత మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాల గురించి నిత్యం సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతిపక్షాల నుంచి సీఎం జగన్, ప్రభుత్వం, పార్టీపై ఎలాంటి విమర్శలు వచ్చినా.. సరైన విధంగా కౌంటర్ చేసేలా చూడనున్నారు. ప్రతీ జిల్లాకు ఇప్పటికే కన్వీనర్, కో-కన్వీనర్లను నియమించారు. వీరి ఆధ్వర్యంలో జిల్లాల్లో కూడా వర్క్ షాపులు పెట్టి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. వీరందరికీ సజ్జలనే బాస్‌గా ఉంటారు. ఇకపై సోషల్ మీడియాకు సంబంధించిన ఏ విషయమైనా సజ్జల కనుసన్నల్లోనే జరుగనున్నది. ఆయన రూపొందించిన నిబంధనలు, లక్ష్యాలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఇన్నాళ్లకైనా వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు ఓ తుది రూపం వచ్చిందని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  7 Sep 2022 3:51 AM GMT
Next Story