Telugu Global
Andhra Pradesh

అమ్మో చిరుత.. మెట్లమార్గంలో తగ్గిన రద్దీ

అలిపిరి నడక మార్గంలో ప్రతి రోజు 12 వేల నుంచి 24 వేల మంది భక్తులు కొండపైకి వెళ్లేవారు. అయితే బుధవారం అలిపిరి మెట్ల మార్గం నుంచి 8,200 మంది మాత్రమే తిరుమలకు వెళ్లారు. గురువారం కూడా రద్దీ బాగా తగ్గిపోయింది,

అమ్మో చిరుత.. మెట్లమార్గంలో తగ్గిన రద్దీ
X

తిరుమలలో రూ.300 ప్రత్యేక దర్శనం బుక్ చేసుకున్న భక్తుల లాగే కాలి నడక, టైమ్ స్లాట్ టోకెన్ భక్తులకు కూడా చిటికెలో దర్శనం అయిపోతోంది. కారణం కాలినడక భక్తుల సంఖ్య బాగా తగ్గిపోవడమే. కాలినడకన వెళ్లాల్సినవారంతా వాహనాల్లో కొండపైకి చేరడంతో.. సర్వదర్శనం(టోకెన్ లేని) క్యూ లైన్ల వద్ద రద్దీ బాగా పెరిగిపోయింది. చిరుత భయంతో చాలామంది భక్తులు బస్సులు, ఇతర వాహనాల్లో కొండపైకి చేరుకుంటున్నారు. మొత్తమ్మీద కాలి నడక దారుల్లో రద్దీ తగ్గినా, కొండపై మాత్రం భక్తుల సంఖ్య తగ్గకపోవడం విశేషం.

పుకార్లు, షికార్లు, నిబంధనలు..

ఓవైపు చిరుత పులుల్ని బోనుల్లో బందిస్తున్నా, మరోవైపు వాటి జాడపై ఇంకా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం మరో చిరుత జాడ తెలిసింది కానీ, అది బోనులో చిక్కలేదు. ఇక భక్తుల ద్వారా రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. దీంతో అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల తాకిడి తగ్గింది. మెట్ల పూజలాంటి మొక్కులు ఉన్నవారు మాత్రమే కాలి నడక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చిన్న పిల్లలు ఉన్నవారు బస్సులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నారులను మెట్ల మార్గంలోకి అనుమతించకపోవడంతో చిన్నారులతో వచ్చిన కుటుంబాలన్నీ బస్సుల్లోనే కొండపైకి వస్తున్నాయి.

అలిపిరి నుంచి 8,200మంది..

అలిపిరి నడక మార్గంలో ప్రతి రోజు 12 వేల నుంచి 24 వేల మంది భక్తులు కొండపైకి వెళ్లేవారు. అయితే బుధవారం అలిపిరి మార్గంలో 8,200 మంది మాత్రమే తిరుమలకు వెళ్లారు. గురువారం కూడా రద్దీ బాగా తగ్గిపోయింది, అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది. నడక మార్గంలో ప్రస్తుతం సెక్యూరిటీ సిబ్బంది వద్ద మాత్రమే కర్రలు కనిపించాయి. భక్తులకు ప్రయోగాత్మకంగా కర్రలు ఇస్తున్నారని చెప్పినా.. అధికారికంగా మొదలు కాలేదు. కర్రల ప్రయోగంపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ, టీటీడీ వెనకడుగు వేసే అవకాశాలున్నాయి.

First Published:  18 Aug 2023 2:25 AM GMT
Next Story