Telugu Global
Andhra Pradesh

అనంత హైవేల వెంబడి టమోటా గుట్టలు.. ఎందుకిలా?

పంట ఒక్కసారిగా భారీగా మార్కెట్‌కు రావడం, అది ఎగుమతికి అవసరమైన నాణ్యత లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు భారీ వర్షాల కారణంగా వ్యాపారులు జంకుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

అనంత హైవేల వెంబడి టమోటా గుట్టలు.. ఎందుకిలా?
X

ఉమ్మడి అనంతపురం జిల్లా టమోటా రైతులు నిండా మునిగిపోయారు. రెండు నెలల క్రితం కిలో 100 రూపాయలు తాకిన టమోటా ధర.. ఇప్పుడు 15 కేజీల బాక్స్‌కు 30 రూపాయలు మించడం లేదు. దాంతో రైతులు రోడ్ల పక్కన ట్రాక్టర్లతో తెచ్చి టమోటాను పారబోస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సీఎం జగన్ స్పందించిన మార్కెటింగ్‌ శాఖను రంగంలోకి దింపి పోటీ తనం పెంచి ధర పెరిగేలా చేశారు. ఈసారి అధికారులు కూడా టమోటా రైతుల వైపు చూడడం లేదు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 700 హెక్టార్లతో ఈసారి టమోటా సాగు చేశారు. కానీ గత నెలలో వారంరోజుల పాటు నిరంతరాయంగా జిల్లాలో వర్షం కురిసింది. సగం పైగా మండలాల్లో 6 నుంచి 10 సెంటిమీటర్ల వరకు వర్షం పడింది. దాంతో సగం పంట పొలాల్లోనే పాడైపోయింది. భారీ వర్షాల కారణంగా పంట ఎగుమతికి అవసరమైన నాణ్యతను సాధించలేకపోయింది. మిగిలిన పంటను రైతులు అనంతపురంలోని మార్కెట్‌కు తీసుకురాగా.. అధికారులు నో సేల్‌ బోర్డులు పెట్టేశారు. పంట ఒక్కసారిగా భారీగా మార్కెట్‌కు రావడం, అది ఎగుమతికి అవసరమైన నాణ్యత లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు భారీ వర్షాల కారణంగా వ్యాపారులు జంకుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.



ఎకరాలకు 40వేల వరకు పెట్టుబడి అయిందని.. ఇప్పుడు 15 కేజీల బాక్స్‌ను 30 రూపాయలకు కూడా కొనడం లేదని రైతులు వాపోతున్నారు. చాలా మంది రైతులు అనంతపురం- బెంగళూరు హైవే మీద గుట్టలు గుట్టలుగా టమోటాను పారబోసి పోతున్నారు. టమోటా కాయల కోతకు అవసరమైన కూలీ డబ్బులు కూడా రైతులకు రావడం లేదు. పంటను అలాగే ఉంచితే తోట దెబ్బతింటుందన్న ఉద్దేశంతో కోత కోసి ఇలా రోడ్డు పక్కన పడేస్తున్నారు.

స్పందించని నేతలు, అధికారులు

టమోటా ధరలు ఇలా హఠాత్తుగా పడిపోతుండడంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అనంతపురం జిల్లాలో టమోటా ప్రొసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగాయి. అనంతపురం ఎంపీ, ఇతర ఎమ్మెల్యేలు మైసూరు నుంచి పరిశోధకులను పిలిపించి అనంతపురం జిల్లా టమోటాపై పరీక్షలు చేయించారు. జిల్లాలో పండుతున్న టమోటా మంచి నాణ్యత ఉందని.. వీటి ద్వారా అనేక ప్రొడక్టులు తయారు చేయవచ్చని పరిశోధకులు తేల్చారు. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా నివేదికల రూపంలో రక్షణ శాఖ శాఖ ఆహార పరిశోధన విభాగం వారు జిల్లా ఉన్నతాధికారులకు అందించారు. కానీ, ఆ తర్వాత నేతల్లో, జిల్లా అధికారుల్లో ఊపు తగ్గింది. టమోటా రోడ్ల పాలవడం తిరిగి మొదలైంది.

First Published:  9 Aug 2022 6:45 AM GMT
Next Story