Telugu Global
Andhra Pradesh

వరద సాయంలో జాప్యం వద్దు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనివిధంగా వరద బాధితులను ఆదుకుంటోందని సీఎం జగన్ అన్నారు. కానీ ప్రతిపక్షాలు, పచ్చ మీడియా ప్రభుత్వ అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

వరద సాయంలో జాప్యం వద్దు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
X

'వరద బాధితులకు సాయం చేయడంలో అధికారులు, సిబ్బంది స్పీడు పెంచాలి. ఏ ఒక్క బాధితుడు కూడా మిస్ కావొద్దు. ప్రతి ఒక్కరికీ రూ. 2 వేల ఆర్థిక సాయం అందజేయండి. నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షించండి. అక్కడ సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేయండి. ప్రజలకు ఏ ఇబ్బంది కలగనివ్వొద్దు. ప్రతిపక్షాలు, పచ్చ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధుల కొరత లేదు. కాబట్టి అధికారులు ముమ్మరంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనండి' అంటూ సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సోమవారం ఆయన వరద పరిస్థితిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఇందులో పాల్గొన్నారు.

పంపిణీ ముమ్మరం చేయండి

వరద నీరు తగ్గుముఖం పడుతోంది కాబట్టి.. సీనియర్‌ అధికారులు, కలెక్టర్లు బాధ్యత తీసుకొని పరిస్థితిని సమీక్షించాలని ముఖ్యమంత్రి కోరారు. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లు కూడా మిగిలిపోకుండా 2వేల రూపాయల సహాయం అందించాలని ఆదేశించారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్.. వరద బాధిత కుటుంబాలకు పంపిణీ చేయాలని సూచించారు. కలెక్టర్లు, సీనియర్‌ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు సరుకుల పంపిణీని ముమ్మరం చేయాలన్నారు.

విపక్షాల కుట్రను తిప్పికొడతాం

ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనివిధంగా వరద బాధితులను ఆదుకుంటోందని సీఎం జగన్ అన్నారు. కానీ ప్రతిపక్షాలు, పచ్చ మీడియా ప్రభుత్వ అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని వాపోయారు. అధికారులకు, సిబ్బందికి ఏం కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు. బాధిత కుటుంబాలతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. తాగునీరు అందించాలని.. పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూసుకోవాలని కోరారు.

నష్టం అంచనా వేయండి

10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలని, గర్భవతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం సూచించారు. వారిని ఆస్పత్రులకు తరలించాలన్నారు. వైద్యాధికారులు,స్పెషలిస్టులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని, అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది, మందులు ఉండేలా చూసుకోవాలని సీఎం సూచించారు. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.

First Published:  18 July 2022 9:14 AM GMT
Next Story