Telugu Global
Andhra Pradesh

బాబు, పవన్ లకు నో ఛాన్స్ - రాజమండ్రి ఎంపీ భరత్

రాజధాని పేరుచెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు, సొంత పుత్రుడు, దత్త పుత్రుడు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. రాజధాని అక్కడికి వస్తుందని ముందే తెలుసు కాబట్టే రైతుల నుండి కారుచౌకగా భూములు కొని, ఆ తరువాత వాటిని పంచుకున్నారని ఆయన మండిపడ్డారు.

బాబు, పవన్ లకు నో ఛాన్స్ - రాజమండ్రి ఎంపీ భరత్
X

రాష్ట్రాన్ని అడ్డంగా బొక్కేయడానికి చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్ నాటకాలు పండటం లేదని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అంటున్నాడు, పవన్ ఒక్క ఛాన్స్ అంటున్నాడు.. వీరికెందుకివ్వాలి ఛాన్స్ అంటూ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన రాజమండ్రి లో మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన గడువులు, షరతులకు దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించడాన్ని స్వాగతించారు.

రాష్ట్రంలో రాజధాని పేరుచెప్పి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు, సొంత పుత్రుడు, దత్తపుత్రుడు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. రాజధాని అక్కడికి వస్తుందని ముందే తెలుసు కాబట్టే రైతుల నుండి కారుచౌకగా భూములు కొని, ఆ తరువాత వాటిని పంచుకున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్ల రూపాయలు గడించాలని పన్నాగం పన్నారన్నారు. ఎప్పుడైతే జగన్ వికేంద్రీకరణ అన్నారో.. ఆ నాటి నుండీ చంద్రబాబు, చిన్నబాబు, పవన్ కు వణుకు పట్టుకుందని, అమరావతి కాకుండా మరెక్కడో పాలన అంటే మన బతుకులేంటనే భయం వారికి పట్టుకుందన్నారు.‌ అందుకే రైతుల ముసుగులో దొంగ పాదయాత్ర ప్రారంభించి అడ్డంగా దొరికిపోయారన్నారు. నిజమైన రైతులే పాదయాత్ర చేస్తుంటే ఎందుకు అమరావతి నుండి అరసవిల్లి యాత్ర కొనసాగించడం లేదని ప్రశ్నించారు.

తాము మొదటి నుండీ చెబుతూనే ఉన్నాం అది అమరావతి రైతుల పాదయాత్ర కాదు.. రైతుల ముసుగులో టీడీపీ దొంగ పాదయాత్ర అని. అది ఈ రోజు స్పష్టమైందన్నారు. మళ్ళా ఇప్పుడు చినబాబు యాత్ర అట..ఇటువంటి దొంగ యాత్రల వల్ల ప్రజాభిమానం మాట దేవుడెరుగు.. నవ్వులపాలవుతున్నారన్న విషయాన్ని గ్రహించాలన్నారు.‌ చంద్రబాబు, పవన్ ఇద్దరికిద్దరూ తోడు దొంగలే అన్నారు. పవన్ ఒక్క ఛాన్స్ అంటున్నారు.. అసలు ఆయన పొంతనలేని మాటలతో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఆయనను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరిని ఈదినట్లేనన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే జగన్ లక్ష్యమని, అందుకే వికేంద్రీకరణతోనే ఇది సాధ్యమని సీఎం భావించారన్నారు. అటు శ్రీకాకుళం నుండి అనంతపురం దాకా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే జగన్ ఆకాంక్ష అన్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలని, మహిళలు అన్ని రంగాలలో రాణించాలనే సత్ససంకల్పంతో సంక్షేమ పాలన ఒక మహాయజ్ఞంగా జగన్ నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంక్షేమ పథకాలు అమలు విషయంలో వెనుకడుగు వేయకుండా సమర్థవంతంగా జగనన్న అమలుచేసి, ఎన్నో కోట్ల కుటుంబాలలో వెలుగులు కురిపిస్తున్నారని చెప్పారు. ప్రజలను నట్టేట ముంచడానికి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటందుకు చంద్రబాబు, చిన్నబాబు, దత్తత బాబు ఆడే జిమ్మిక్కులు, టక్కుటమార విద్యలకు మోసపోవద్దని, జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. ‌గతంలో చేసిన తప్పిదాలు వేయవద్దని ఎంపీ భరత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story