Telugu Global
Andhra Pradesh

టీడీపీతో పొత్తు లేదు.. అధికార ప్రతినిధులు చెప్పండి

పొత్తు కేవలం జనసేనతో మాత్రమే ఉంటుందని బీజేపీ అగ్రనాయకత్వం స్పష్టత ఇచ్చింది. ఈ విషయాన్ని టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే పార్టీ అధికార ప్రతినిధులకు స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్టు చెబుతున్నారు.

టీడీపీతో పొత్తు లేదు.. అధికార ప్రతినిధులు చెప్పండి
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ భేటీ తర్వాత రాజకీయ పరిణామాలపై బీజేపీ ఎలా స్పందిస్తుంది అన్నదానిపై ఆసక్తి ఉంది. భేటీ అనంతరం బీజేపీ కూడా కలిసి వచ్చేలా తాను ప్రయత్నాలు చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీని టీడీపీ పక్షానికి పవన్ కల్యాణ్ తీసుకొస్తారా అన్న చర్చకు అవకాశం ఏర్పడింది. పైగా ఏపీ బీజేపీలోని కొందరు టీడీపీ సానుభూతిపరులు ఎప్పటిలాగే పవన్, చంద్రబాబు భేటీపై కొద్దిగా సానుకూలంగా మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఏపీ రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన సూచనలు చేసింది. టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదని తేల్చిచెప్పింది. చంద్రబాబు, పవన్ భేటీని చూసి గందరగోళానికి గురి కావద్దని స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పొత్తు కేవలం జనసేనతో మాత్రమే ఉంటుందని బీజేపీ అగ్రనాయకత్వం స్పష్టత ఇచ్చింది. ఈ విషయాన్ని టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే పార్టీ అధికార ప్రతినిధులకు స్పష్టంగా చెప్పాలని రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్టు చెబుతున్నారు.

ఎక్కడ కూడా టీడీపీతో కలిసేందుకు బీజేపీ సానుకూలంగా ఉందన్న సంకేతాలే వెళ్ళడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. చంద్రబాబు నాయుడుతో పవన్ కల్యాణ్ భేటీని ఒక సాధారణ భేటీ గానే చూడాలని అంతకుమించి దానికి ప్రాధాన్యత ఇవ్వదు అని బీజేపీ రాష్ట్ర నాయకులకు స్పష్టత ఇచ్చింది. అయితే జరుగుతున్న పరిణామాలను చూస్తున్నా.. పవన్ వ్యాఖ్యలను పరిశీలించినా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అంగీకరించినా, అంగీకరించకపోయినా జనసేన మాత్రం చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఆ పార్టీతో లేనిపోని వివాదాలకు, ఘర్షణకు అవకాశం ఇవ్వకూడదనే జనసేన ఇప్పటికిప్పుడు బీజేపీతో తమకు సంబంధం లేదు, ఉండబోదు అని ప్రకటించేందుకు సాహసించడం లేదు. ఎన్నికల సమయానికి మాత్రం చంద్రబాబు, పవన్‌ల ఉమ్మడి శత్రువు జగనే కాబట్టి వారిద్దరూ చేతులు కలపడం ఖాయం. ఇప్పటికే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు బ్యాంకును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోనని పవన్ కల్యాణ్‌ చెప్పారు. ఆ మాటల స్పష్టమైన ఉద్దేశం జనసేన టీడీపీతో కలిసి పోటీ చేస్తుందనే.

First Published:  10 Jan 2023 5:41 AM GMT
Next Story