Telugu Global
Andhra Pradesh

ఒక కలెక్టర్, ముగ్గురు ఎస్పీలు.. ఏపీలో మళ్లీ కొత్త నియామకాలు

వారిచ్చిన రిపోర్ట్ ల ప్రకారం మరికొందరిపై వేటు వేసింది. ఆయా స్థానాల్లో ఇప్పుడు కొత్త నియామకాలు చేపట్టింది.

ఒక కలెక్టర్, ముగ్గురు ఎస్పీలు.. ఏపీలో మళ్లీ కొత్త నియామకాలు
X

ఏపీలో ఎన్నికలు పూర్తయినా, ఎన్నికల బదిలీలు మాత్రం ఆగలేదు. ఎన్నికల తర్వాత జరిగిన గొడవల కారణంగా మూడు జిల్లాలకు చెందిన ఎస్పీలు, మరో జిల్లా కలెక్టర్ పై వేటు వేసిన ఈసీ.. తాజాగా వారి స్థానాల్లో కొత్తవారిని నిమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లట్కర్‌ శ్రీకేశ్‌ బాలాజీ నియమితులయ్యారు. ఇక పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్‌, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్‌, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి నియామకాలు పూర్తయ్యాయి.

ఏపీలో ఎన్నికల ముందు కూడా బదిలీలు జరిగాయి. ఎస్పీలు, కలెక్టర్లతోపాటు ఏకంగా రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీని కూడా ఈసీ బదిలీ చేసింది. అయినా కూడా ఎన్నికల రోజు హింస ఆగలేదు, ఎన్నికల తర్వాత కూడా గొడవలు కంటిన్యూ కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఎన్నికల ముందు బదిలీలు జరిగిన ప్రాంతాల్లోనే గొడవలు ఎక్కువయ్యాయి. దీంతో ఎన్నికల కమిషన్.. ఏపీ వ్యవహారాలపై సీరియస్ అయింది. ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిపించి మరీ క్లాస్ తీసుకుంది. వారిచ్చిన రిపోర్ట్ ల ప్రకారం మరికొందరిపై వేటు వేసింది. ఆయా స్థానాల్లో ఇప్పుడు కొత్త నియామకాలు చేపట్టింది.

మరోవైపు ఏపీలో జరిగిన ఎన్నికల అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేపట్టింది. వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో సిట్ అధికారులు విచారణ మొదలు పెట్టారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. సిట్ టీమ్స్ అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయి పరిశీలన జరిపాయి. ఎప్పటికప్పుడు ఆ వివరాలను డీజీపీకి తెలియజేస్తూ సిట్ తమ విచారణ పూర్తి చేస్తుంది.

First Published:  18 May 2024 2:32 PM GMT
Next Story