Telugu Global
Andhra Pradesh

దసరా కాదు డిసెంబర్.. విశాఖ ముహూర్తం మారిందా..?

దసరా నాటికి కార్యాలయాలన్నీ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేలా లేవు. అందుకే డిసెంబర్ ముహూర్తం ఫైనల్ అయ్యేలా ఉంది.

దసరా కాదు డిసెంబర్.. విశాఖ ముహూర్తం మారిందా..?
X

దసరా నుంచి విశాఖ పాలనా రాజధానిగా మారిపోతుందని ఇటీవల సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. అధికారులు కూడా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కొంతమంది మంత్రులు, నేతలు కూడా దసరా ముహూర్తానికి విశాఖకు మకాం మార్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇప్పుడు ఆ ముహూర్తం మారినట్టు తెలుస్తోంది. డిసెంబర్ లో సీఎం జగన్ విశాఖకు మకాం మారుస్తారంటూ ప్రత్యేకించి ఎల్లో మీడియాలో కథనాలొచ్చాయి. తూచ్.. దసరాకు కాదు! అంటూ ఈనాడు వ్యంగ్యాస్త్రాలు విసిరింది. దీనికి బలమైన కారణాలు కూడా చెప్పడం విశేషం.

జగన్ పుట్టినరోజు, కోర్టు కేసులు..

డిసెంబరు 21న జగన్‌ పుట్టినరోజు సందర్భంగా పాలనా రాజధాని మారుస్తారని అంటున్నారు. ఇక మూడు రాజధానుల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసు కూడా డిసెంబర్ నాటికి తేలేలా ఉంది. కోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందో చూసిన తర్వాతే.. సీఎం విశాఖకు వెళ్లడంపై స్పష్టత వస్తుందని ఈనాడు కథనం సారాంశం. ఈ కథనాలు ఎలా ఉన్నా.. దసరా నాటికి కార్యాలయాలన్నీ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేలా లేవు. అందుకే డిసెంబర్ ముహూర్తం ఫైనల్ అయ్యేలా ఉంది.

అదనపు కార్యాలయం ఎందుకు..?

మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా ఇబ్బంది లేకుండా సీఎం జగన్ తెలివిగా నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. విశాఖలో ఏర్పాటు చేసే సీఎం క్యాంపు కార్యాలయానికి అదనపు కార్యాలయం అనే పేరు పెట్టారు. అదనపు క్యాంపు కార్యాలయం ఏర్పాట్లు పరిశీలన చేయడానికి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మున్సిపల్, ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలతో ఈ కమిటీ ఏర్పాటైంది. కార్యాలయాన్ని రుషికొండపై కడుతున్నారనే విషయం తెలిసిందే. మరి హడావిడిగా ఇప్పుడు కమిటీ పేరుతో ఉత్తర్వులివ్వడం దేనికో తేలాల్సి ఉంది. విశాఖలో ఏర్పాటు చేసేది అదనపు కార్యాలయం అయితే.. విశాఖను అదనపు రాజధాని అనాలేమో. ఎన్నికలు వచ్చేలోగా మూడు రాజధానుల విషయంలో పంతం నెగ్గించుకోవడంపై వైసీపీ ప్రధానంగా దృష్టిసారించినట్టు కనపడుతోంది.

First Published:  12 Oct 2023 2:28 AM GMT
Next Story