Telugu Global
Andhra Pradesh

జగన్ నుంచి శ్రీధర్ రెడ్డికి పిలుపు - క్లాస్ తీసుకుంటారా..? కూల్ చేస్తారా..?

భేటీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగినట్టుగా నిధుల మంజూరుకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తారా..? లేక ప్రతిపక్ష ప్రచారానికి బలాన్ని ఇచ్చేలా అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలపై క్లాస్ తీసుకుంటారా..?

జగన్ నుంచి శ్రీధర్ రెడ్డికి పిలుపు - క్లాస్ తీసుకుంటారా..? కూల్ చేస్తారా..?
X

ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఇటీవ‌ల‌ పదేపదే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. సోమవారం సీఎం జగన్ ను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలవబోతున్నారు. ఈ భేటీలో కోటంరెడ్డి శ్రీధర్ వ్యవహారంపై జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇటీవల రెండు సందర్భాల్లో శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

వైసీపీని రాజకీయంగానూ ఇరుకున పెట్టాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో తొలుత కోటంరెడ్డి ఫైర్ అయ్యారు. రోడ్లు వేసేందుకు నిధులు ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఒక సందర్భంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ ను కలిస్తే ఆయన తనను అవమానించేలా వ్యవహరించారని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తాను వెళ్తే కనీసం కూర్చోండి అని కూడా రావత్ అనలేదన్నారు. తానే కుర్చీ లాక్కొని ఎదురుగా కూర్చున్నా సరే కనీసం తన వైపు తలెత్తి చూడలేదని విమర్శించారు.

నిధుల‌ మంజూరుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆర్థిక శాఖ అధికారుల పెత్తనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాను అందరు ఎమ్మెల్యే ల్లాగా మౌనంగా ఉంటాను అనుకుంటున్నారేమో.. తాను మౌనంగా భరిస్తూ ఉండే వ్యక్తిని కాదు అని హెచ్చరిక ధోరణిలో శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత పింఛన్ల పైన శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీని ఇరుకున పెట్టాయి. తన నియోజకవర్గంలో 2700 పింఛన్లను తొలగించేందుకు సిద్ధమయ్యారని, నోటీసులు ఇచ్చారని, ఉన్న వాటిని ఎలా తొలగిస్తారంటూ ఏకంగా మీడియా కెక్కారు. దాంతో అప్పటివరకు పింఛన్లు తొలగిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారానికి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు తోడ్పాటును ఇచ్చినట్టు అయింది. చూశారా అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా పింఛన్ల తొలగింపు నిజమేనని అంగీకరిస్తున్నారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.

ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని జగన్ మోహన్ రెడ్డి పిలిపించుకుంటున్నారు. భేటీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగినట్టుగా నిధుల మంజూరుకు జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తారా..? లేక ప్రతిపక్ష ప్రచారానికి బలాన్ని ఇచ్చేలా అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలపై క్లాస్ తీసుకుంటారా..? అన్నది చూడాలి. తొలి నుంచీ వైసీపీకి రాజకీయంగా తలనొప్పులు తెచ్చిపెడుతున్న వారిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలే ముందుంటున్నారు.

First Published:  1 Jan 2023 4:01 PM GMT
Next Story