Telugu Global
Andhra Pradesh

ఇంతకీ అది ట్యాపింగా..? రికార్డింగా..? కోటంరెడ్డిపై కేసు పెడతారా..?

టీడీపీలోకి వెళ్లేందుకే ఆయన ఇలా బురదజల్లుతున్నారంటూ పార్టీ పరంగా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ పరంగా అసలా ఆరోపణల్లో వాస్తవం ఉందా, లేదా అని తేల్చేందుకు ఇంటెలిజెన్స్ టీమ్ రంగంలోకి దిగింది.

ఇంతకీ అది ట్యాపింగా..? రికార్డింగా..? కోటంరెడ్డిపై కేసు పెడతారా..?
X

అది ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాదు రికార్డింగ్, అది కూడా మీలో ఎవరో చేశారు, మాకు సంబంధం లేదంటారు పార్టీ నేతలు. ఇంతకీ అది ట్యాపింగా, రికార్డింగా.. నిగ్గు తేల్చేందుకు ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. కోటంరెడ్డి చేసినవి తప్పుడు ఆరోపణలు అని తేలితే మాత్రం చట్టప్రకారం చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం.

కోటంరెడ్డి చేసినవి చిన్నా చితకా ఆరోపణలు కావు. గతంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ పేరుతో చంద్రబాబుపై, వైసీపీ చేసిన ఆరోపణలకంటే పెద్దవి. ఏపీలో అధికార పార్టీకి చెందిన 35మంది ఎమ్మెల్యేల కాల్స్ రికార్డ్ అవుతున్నాయంటూ ఆయన ఆరోపణలు చేశారు. దానిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టింది. టీడీపీలోకి వెళ్లేందుకే ఆయన ఇలా బురదజల్లుతున్నారంటూ పార్టీ పరంగా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ పరంగా అసలా ఆరోపణల్లో వాస్తవం ఉందా, లేదా అని తేల్చేందుకు ఇంటెలిజెన్స్ టీమ్ రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి విడుదల చేసిన ఆడియో వివరాలను సేకరిస్తున్నారు. ఎమ్మెల్యేతో మాట్లాడిన రామ శివారెడ్డిని విచారించే అవకాశం ఇంది. రామ శివారెడ్డి ఫోన్ డేటాను ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషిస్తున్నారు.

ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేస్తానంటూ కోటంరెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఈ వ్యవహారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ వ్యవహారం మరింత ముదరకముందే, సొంత పార్టీ నేతలపైనే వైసీపీ నిఘా పెట్టిందనే విషయం మరింతగా జనాల్లోకి, పార్టీ కార్యకర్తల్లోకి వెళ్లకముందే నష్టనివారణ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. అందుకే హడావిడిగా మంత్రులు, మాజీ మంత్రులు మూకుమ్మడిగా కోటంరెడ్డిపై విరుచుకుపడ్డారు. ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిపోశారు.

వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఆనం రామనారాయణ రెడ్డి కూడా చేశారు. కానీ ఆయన విషయంలో ఎవరూ స్పందించలేదు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆధారాలతో మీడియా ముందుకొచ్చేసరికి వైసీపీ నుంచి ఎదురుదాడి తీవ్రమైంది. రామనారాయణ రెడ్డిని అసలు ఈవిషయంలో ఎవరూ పట్టించుకోవడంలేదు. కోటంరెడ్డి కేవలం పార్టీ మారేందుకే ఇలా ఆరోపణలు చేస్తున్నారంటూ ఇతర నేతలు మండిపడుతున్నారు. ఆయన పార్టీ లైన్ దాటారని, పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇంటెలిజెన్స్ ని రంగంలోకి దింపి విచారణ అంటున్నారు. కోటంరెడ్డితో ఫోన్లో మాట్లాడిన స్నేహితుడిని కూడా మీడియా ముందుకు తెస్తామంటూ మాజీ మంత్రి బాలినేని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ స్నేహితుడు మాట్లాడతారని అనుకోలేం. చివరకు కోటంరెడ్డివి అసత్య ఆరోపణలు అని తేల్చితే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

First Published:  2 Feb 2023 5:34 AM GMT
Next Story