Telugu Global
Andhra Pradesh

నెల్లూరులో మళ్లీ లొల్లి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్

ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని కమ్యూనిటీ హాల్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఇంతలో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు.

నెల్లూరులో మళ్లీ లొల్లి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్
X

వైసీపీనుంచి బయటకొచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టే వ్యూహంతో ముందుకెళ్తున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ విషయంలో రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయనకంటే వెనకపడ్డారనే చెప్పాలి. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అపరిష్కృత సమస్యలపై కోటంరెడ్డి పూర్తి స్థాయిలో గళమెత్తారు.


ఆమధ్య బారాషహీద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా అది తన ఘనతగా చెప్పుకున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఆ విషయంలో రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వెనకపడ్డారు. ఆ తర్వాత పొట్టేపాలెం కలుజు దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం కోసం జలదీక్ష చేపడతానని ఎమ్మెల్యే ప్రకటించగా ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు నెల్లూరులో క్రిస్టియన్ కమ్యూనిటి హాల్ కోసం ఆయన నిరసన ప్రదర్శనకు బయలుదేరబోగా మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం గతంలో సీఎం జగన్ మూడు సార్లు స్వయంగా హామీ ఇచ్చినా పనికాలేదంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. కలెక్టర్ తో మాట్లాడి స్థలం చూపించినా ప్రభుత్వం కనీసం 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయలేదంటున్నారు. నెల్లూరు సిటీ, రూరల్ పరిధిలోని చర్చిల వద్దకు వెళ్లి ఒక్కో ఇటుకరాయి విరాళంగా సేకరించి కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు ప్రయత్నించారు. ఈదశలో ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని కమ్యూనిటీ హాల్ నిర్మాణ ప్రదేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు.

ఇరకాటంలో ప్రభుత్వం..

మొన్న బారాషహీద్ దర్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేయగా.. ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు కోటంరెడ్డి. ఇప్పుడు కమ్యూనిటీ హాల్ విషయంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగితే అది ఎమ్మెల్యే కోటంరెడ్డి విజయం అనే అంటారు స్థానికులు. అందుకే ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు మైనార్టీలకోసం నిధులు విడుదల చేసి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నారనే ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. ఈ వ్యవహారాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. మొత్తమ్మీద నెల్లూరు రూరల్ లో నిత్యం ఏదో ఒక సమస్యను హైలెట్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటూ, పొలిటికల్ హీట్ పెంచుతున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.

First Published:  23 May 2023 3:09 AM GMT
Next Story