Telugu Global
Andhra Pradesh

ఆ ఐదుగురికి ఎన్నికోట్లిచ్చావ్ జగన్..?

టీడీపీ, జనసేన నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలంగా ఓటు వేసినందుకు వారికి ఎన్నికోట్లిచ్చారని ప్రశ్నించారు. తాము చేస్తే నీతి, పక్కనవాళ్లు చేస్తే అవినీతి అనుకోవడం వైసీపీ అధిష్టానానికే చెల్లిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆ ఐదుగురికి ఎన్నికోట్లిచ్చావ్ జగన్..?
X

వైసీపీనుంచి తనను సస్పెండ్ చేయడం మంచి నిర్ణయమేనని, అయితే సస్పెండ్ చేసిన విధానమే సరికాదంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కనీసం షోకాజ్ నోటీస్ లేకుండా సస్పెండ్ చేస్తారా..? అని ప్రశ్నించారాయన. ఇది ప్రజాస్వామ్యం కాదని, పెత్తందారీ వ్యవస్థ అని చెబుతున్నారు.

డబ్బులకు అమ్ముడుపోయే రకం కాదు..

పార్టీనుంచి సస్పెండ్ చేసే క్రమంలో ఆ నలుగురిపై పెద్ద నిందే మోపింది వైసీపీ అధిష్టానం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసినందుకు ఒక్కొకరికి 15 కోట్ల రూపాయలనుంచి 20 కోట్ల రూపాయల వరకు ముట్టిందని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ వ్యవహారంపై కూడా కోటంరెడ్డి ఘాటుగా స్పందించారు. టీడీపీ, జనసేననుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలంగా ఓటు వేసినందుకు వారికి ఎన్నికోట్లిచ్చారని ప్రశ్నించారు. తాము చేస్తే నీతి, పక్కనవాళ్లు చేస్తే అవినీతి అనుకోవడం వైసీపీ అధిష్టానానికే చెల్లిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సజ్జలపై చర్యలు తీసుకోవాలి..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ జరిగిందని, ఆ ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేశామనే విషయం బయటకు తెలిసే ఛాన్సే లేదన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. అలాంటి పరిస్థితుల్లో తాము టీడీపీకే ఓటు వేశామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం హాస్యాస్పదం అని చెప్పారు. ఒకవేళ సజ్జలకు నిజంగానే రహస్య ఓటింగ్ గురించి సమాచారం ఉంటే కచ్చితంగా ఆయనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు.

తన నియోజకవర్గంలో ఉన్న నమస్యల పరిష్కారం విషయంలో రాజీపడేది లేదని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తనను సస్పెండ్ చేయడం వందశాతం సరైన నిర్ణయమేనని, అయితే సస్పెండ్ చేసిన విధానం సరికాదన్నారు. తనతోపాటు, ఆనం రామనారాయణ రెడ్డి కూడా కొన్ని నెలలుగా పార్టీకి దూరంగా ఉన్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో సస్పెన్షన్ వేటు దారుణం అని అన్నారు. వారిద్దరూ వైసీపీకే ఓటు వేశామని చెబుతున్నా సస్పెన్షన్ వేటు వేశారని, అసలు రహస్య ఓటింగ్ గురించి వైసీపీ అధినాయకత్వానికి సమాచారం ఎలా తెలిసిందని ప్రశ్నించారు.

First Published:  24 March 2023 1:40 PM GMT
Next Story