Telugu Global
Andhra Pradesh

జనసేనకు షాక్‌.. జిల్లా అధ్యక్షుడి రాజీనామా

వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని లేఖలో స్పష్టం చేశారు మనుక్రాంత్ రెడ్డి. దాదాపు 6 ఏళ్లుగా జిల్లాలో పార్టీ కోసం పనిచేశానని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా అధ్యక్షపదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

జనసేనకు షాక్‌.. జిల్లా అధ్యక్షుడి రాజీనామా
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేసిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 సీట్లు మాత్రమే కేటాయించడం సహా టీడీపీ నుంచి వచ్చిన వలస నేతలకే టికెట్లు ఇవ్వడం పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. తాజాగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి జనసేనకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్‌ పవన్‌కల్యాణ్‌కు తన రాజీనామా లేఖను పంపారు.

వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని లేఖలో స్పష్టం చేశారు మనుక్రాంత్ రెడ్డి. దాదాపు 6 ఏళ్లుగా జిల్లాలో పార్టీ కోసం పనిచేశానని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా అధ్యక్షపదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మనుక్రాంత్. తన రాజీనామా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని లేఖలో కోరారు. అయితే నెల్లూరు సిటీ టికెట్ ఆశించారు మనుక్రాంత్ రెడ్డి. పొత్తులో భాగంగా ఆ సీటును టీడీపీకి కేటాయించారు. దీంతో ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.

మనుక్రాంత్‌ రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించారు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. మనుక్రాంత్ రెడ్డి అనుభవానికి, స్థాయికి తగ్గట్లుగా పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తామన్నారు. మనుక్రాంత్ రెడ్డి చేరిక వైసీపీకి లాభం చేకూరుస్తుందన్నారు.

ఇక వరుస రాజీనామాలతో జనసేన భవితవ్యం గందరగోళంలో పడింది. పోతిన మహేష్‌, ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ, కైకలూరులో బీవీ రావు, అనకాపల్లి ఇన్‌ఛార్జి పరుచూరి భాస్కర రావు, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కేతంరెడ్డి వినోద్‌ కుమార్‌, పిఠాపురంలో శేషు కుమారితో పాటు మరికొంత మంది కీలక నేతలు జనసేనకు రాజీనామా చేశారు. పార్టీ చీఫ్‌ పవన్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేవలం 21 సీట్లకే పరిమితం అవడం, తెలుగుదేశం వారికి టికెట్లు కేటాయించడంతో పార్టీ కేడర్‌ సైతం తీవ్ర అసంతృప్తిలో ఉంది.

First Published:  11 April 2024 5:19 AM GMT
Next Story