Telugu Global
Andhra Pradesh

నెల్లూరు టికెట్ నాదే.. అనిల్ సెల్ఫ్ డిక్లరేషన్

నెల్లూరు సిటీ టికెట్ తనకు రాదు అని కొంతమంది శునకానందం పొందుతున్నారని, అలాంటి వారంతా కొన్నిరోజులు ప్రశాంతంగా పడుకోండి అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు రాసి పెట్టుకోండి అంటూ ఘాటుగా మాట్లాడారు.

Anil Kumar Yadav
X

అనిల్ కుమార్ యాదవ్

2024 ఎన్నికలు - వైసీపీ టికెట్ల కేటాయింపులు. ఏపీలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మీటింగులు పెట్టిమరీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు సీఎం జగన్.


ఇప్పటికే కుప్పం, విజయవాడ తూర్పు వంటి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారాయన. చీరాల, పర్చూరు వంటి చోట్ల ఇన్ చార్జ్ లను నియమించి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ఇక తాడికొండ, వెంకటగిరి లాంటి స్థానాల్లో సిట్టింగ్ లకు ఛాన్స్ లేదని చూచాయగా చెప్పేశారు. వారి ప్లేస్ లోకి ఇన్ చార్జ్ లను తెచ్చేశారు. మిగతా చోట్ల కూడా గడప గడపలో ఎవరు యాక్టివ్ గా ఉంటారో వారికే సీటు అంటూ తేల్చేశారు సీఎం జగన్.

అయినా కూడా చాలామందిలో అనుమానాలు, అసంతృప్తులు ఉండనే ఉన్నాయి. ఆ అనుమానం తోనే బాలినేని శ్రీనివాసులరెడ్డి వంటి సీనియర్లు కూడా ఏమో జగన్ మనసులో ఏముందో అంటూ చేతులెత్తేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాకు ఇస్తారో, నా భార్యకు ఇస్తారో.. ఆయన ఏం చెప్పినా నేను కాదనేదేముంది అంటూ సర్దుకుపోతున్నారు. ఇలాంటి టైమ్ లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆ సీటు మళ్లీ నాదేనంటూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఎవరూ కర్చీఫ్ వేయకుండా..

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణపై స్వల్ప మెజార్టీతో గెలుపొందారు అనిల్ కుమార్ యాదవ్. సామాజిక సమీకరణాలతో మంత్రి పదవి సంపాదించారు. రెండోదఫా పదవి కోల్పోయారు.


అప్పటినుంచి ఆయనకు వ్యతిరేక వర్గం స్థానికంగా పావులు కదుపుతోంది. మంత్రి కాకాణితో అనిల్ కి విభేదాలున్నాయి, ఆనం రామనారాయణ రెడ్డితో కూడా ఆయనకు పాత గొడవలున్నాయి.


అనిల్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరులో అనిల్ వ్యతిరేక వర్గాన్ని ఒక్కచోటకు చేర్చారు. కార్పొరేటర్లలో సగం మందిని అనిల్ కి దూరం చేశారు. ఇటీవల అనుచరుల విషయంలో పంచాయితీలు కూడా జరిగాయి. ఈలోగా నెల్లూరు సిటీ టికెట్ అనిల్ కి ఈసారి ఇవ్వకపోవచ్చు అనే ప్రచారం మొదలైంది.


నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ఈసారి నెల్లూరు సిటీ నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. దీంతో కాస్త ముందుగానే అనిల్ స్పందించారు. సిటీ టికెట్ ఈసారి కూడా తనదేనంటూ కుండబద్దలు కొట్టారు.

వారిది శునకానందం..

నెల్లూరు సిటీ టికెట్ తనకు రాదు అని కొంతమంది శునకానందం పొందుతున్నారని, అలాంటి వారంతా కొన్నిరోజులు ప్రశాంతంగా పడుకోండి అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు రాసి పెట్టుకోండి అంటూ కాస్త ఘాటుగా మాట్లాడారు.


టీ బంకుల దగ్గర మాట్లాడే అందరికీ కూడా ఇదే చెప్తున్నా.. అనిల్ అనేవాడు నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు అని అన్నారాయన. తాను రాష్ట్రంలో తలవంచేది ఒకే ఒక్క జగన్ కి అని స్పష్టం చేశారు.


ఎమ్మెల్యే అనిల్ వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కలకలంగా మారాయి. ముందుగానే అనిల్ తన సీటుపై అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ప్రకటన చేశారో తేలడంలేదు. జగన్ నుంచి ముందస్తు హామీ ఉందా, లేక ఎలాగూ టికెట్ తనదేననే నమ్మకంతో వైరి వర్గంలో కంగారు పుట్టించడానికి అనిల్ ఆ ప్రకటన చేశారా అనేది తేలాల్సి ఉంది.

First Published:  24 Jan 2023 11:32 AM GMT
Next Story