Telugu Global
Andhra Pradesh

గుంతలకోసం ప్రత్యేకంగా యాప్ అవసరమా..?

గడచిన మూడున్నరేళ్ళుగా రోడ్ల నిర్వహణలో జగన్ ప్రభుత్వం చాలా ఘోరంగా ఫెయిలైంది. రోడ్ల పరిస్ధితికి ఎంతకాలమైన చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిందిస్తూ కూర్చోవటంతోనే కాలాన్ని నెట్టుకొచ్చేస్తోంది.

గుంతలకోసం ప్రత్యేకంగా యాప్ అవసరమా..?
X

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని విషయాల్లో మరీ విచిత్రంగా వ్యవహరిస్తోంది. రోడ్లపై గుంతలుంటే చెప్పటానికి వచ్చే నెలలో ప్రత్యేకంగా యాప్ సిద్ధం చేస్తోందట. రోడ్లపైన ఎక్కడైనా గుంతలుంటే వెంటనే జనాలు సదరు యాప్ ద్వారా ఫిర్యాదు చేయచ్చట. నెల రోజుల్లోపు యాప్ రెడీచేయమని మున్సిపల్ ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే రాష్ట్రం మొత్తంమీద గుంతలు లేని రోడ్లు చాలా అరుదు.

గడచిన మూడున్నరేళ్ళుగా రోడ్ల నిర్వహణలో జగన్ ప్రభుత్వం చాలా ఘోరంగా ఫెయిలైంది. రోడ్ల పరిస్ధితికి ఎంతకాలమైన చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిందిస్తూ కూర్చోవటంతోనే కాలాన్ని నెట్టుకొచ్చేస్తోంది. చంద్రబాబు హయాంలో రోడ్లు సరిగా వేయలేదనే అనుకుందాం. మరి తాను సీఎం అయిన తర్వాత ఆ రోడ్లను బాగుచేయచ్చు కదా. కొత్తగా వేసే రోడ్లను నీటుగా వేయచ్చుకదా..? రాష్ట్రం మొత్తంమీద పలానా ఊరిలో రోడ్లు బాగున్నాయని చెప్పుకునేందుకు కనీసం ఒక్క ఊరుకూడా లేదు.

ప్రతిపక్షాలు, జనాలు రోడ్ల పరిస్ధితిపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఉపయోగం కనబడలేదు. ఇలాంటి నేపథ్యంలో రోడ్లపైన గుంతలుంటే ఫిర్యాదులకు ప్రత్యేకంగా యాప్ రెడీ చేస్తున్నారంటేనే విచిత్రంగా ఉంది. రోడ్ల దుస్ధితిపైన ఫిర్యాదుకు ప్రత్యేకంగా యాప్ ఎందుకు..? సర్పంచ్ స్ధాయి నుంచి ఎంపీ వరకూ ఎక్కడచూసినా అధికారపార్టీ నేతలే కదా ఉన్నది. వీళ్ళనడిగితే రోడ్ల దుస్ధితిని వివరించరా ? ఇప్పటికే గ్రామపంచాయతీల నుండి కార్పొరేషన్ల దాకా రోడ్ల పరిస్ధితిపై కొన్ని వేల ఫిర్యాదులు ఉండేవుంటాయి.

ప్రతివారం కలెక్టర్ల ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలో కూడా రోడ్ల పరిస్ధితులపై ఫిర్యాదులు అందుతున్నాయి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఇదే గోల. పంచాయతీ అధికారుల నుండి కార్పొరేషన్లలోని ఉన్నతాధికారులంతా రోడ్లపైనే కదా తిరుగుతున్నది. వాళ్ళు తిరుగుతున్న రోడ్ల పరిస్ధితిపై నివేదిక ఇవ్వమంటే ఇవ్వరా..? పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలు నిర్వహిస్తున్న రోడ్లు ఎలాగున్నాయో అడిగితే ఉన్నతాధికారులు చెప్పరా..? రాష్ట్రంలో రోడ్ల దుస్ధితిని జగన్ తెలుసుకోవాలంటే రెండు రోజుల పని. ఇంతోటిదానికి మళ్ళీ ప్రత్యేకంగా యాప్ ఒకటి అవసరమా..?

First Published:  27 Nov 2022 4:11 AM GMT
Next Story