Telugu Global
Andhra Pradesh

ఆనం గేమ్స్‌కు నేదురుమల్లి బ్రేక్

ఆటల పోటీలు జరిగితే తన ఆధ్వర్యంలోనే జరగాలని నేదురుమల్లి భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆటల పోటీల్లో ఆనం హవా చెలాయించేందుకు ఇన్‌చార్జ్ వర్గం ససేమిరా అంటోంది.

ఆనం గేమ్స్‌కు నేదురుమల్లి బ్రేక్
X

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని పూర్తిగా ఇంటికి పరిమితం చేసే పనిలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలను పాటించవద్దని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇది వరకు ఆనంతో సన్నిహితంగా పనిచేసిన అధికారులు కూడా ఇంతకాలం సహకరించినందుకు ధన్యవాదాలంటూ ఎమ్మెల్యేకు మేసేజ్‌లు పంపించి దూరం జరిగారు.

గన్‌మెన్ల సంఖ్యను కుదించారు. ఈ నేపథ్యంలో రాపూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా నియోజకవర్గ స్థాయి ఆటలు పోటీలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రెడీ అయ్యారు. గ్రౌండ్‌ను సిద్ధం చేయడం కోసం ఎర్రమట్టిని ఆనం అనుచరులు తరలించారు. ఈ పనులు జరుగుతున్న విషయం తెలుసుకున్న రామ్‌ కుమార్‌ రెడ్డి అధికారులను పురమాయించినట్టు చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఆరు రోజుల పాటు ఈ ఆటల పోటీలు జరగాల్సి ఉంది. అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వ మైదానంలో పనులు చేస్తున్నారంటూ అధికారులు వచ్చి అడ్డుకున్నారు.

నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి వర్గమే అధికారులకు ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. మట్టి తరలింపును అడ్డుకున్న అధికారులు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేయడంతో వాహనాలను పోలీసులు వదిలేశారు. అయితే ఆటల పోటీల కోసం గ్రౌండ్‌లో పనులు మాత్రం జరగనివ్వడం లేదు.

ఆటల పోటీలు జరిగితే తన ఆధ్వర్యంలోనే జరగాలని నేదురుమల్లి భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆటల పోటీల్లో ఆనం హవా చెలాయించేందుకు ఇన్‌చార్జ్ వర్గం ససేమిరా అంటోంది. ఫిబ్రవరిలో ఆటల పోటీలు ప్రారంభం అవుతాయా?. ఒకవేళ జరిగితే ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Next Story