Telugu Global
Andhra Pradesh

మోదీపైనే భారమంతా.. కష్టాల్లో కూటమి

బీజేపీతో జట్టుకట్టినా చంద్రబాబుకి ప్రయోజనం లేదు. ఎల్లో మీడియా ఎలివేషన్లు తప్ప క్షేత్ర స్థాయిలో కూటమిని ప్రజలు పట్టించుకోవడంలేదు.

మోదీపైనే భారమంతా.. కష్టాల్లో కూటమి
X

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రచారం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. చంద్రబాబు, పవన్ కలసి ప్రచారం చేస్తున్నా, ప్రజాగళం అంటున్నా కూడా జనం నమ్మడంలేదు. ఈదశలో ప్రధాని మోదీ ఏపీకి ప్రచారం కోసం వచ్చారు. రోడ్ షో లతో కాస్త హడావిడి సృష్టించారు. ఈ హడావిడితో కూటమికి బలం పెరిగిందని, మోదీ, బాబు, పవన్ ల మైత్రి ప్రజల్లోకి బలంగా వెళ్లిందని అంటోంది ఎల్లో మీడియా. మోదీ రోడ్ షో లను హైలైట్ చేస్తోంది.

మోదీతో లాభమా.. నష్టమా..?

తమని ప్రజలు నమ్మడం లేదు కాబట్టి మోదీని రంగంలోకి దించాలనేది చంద్రబాబు ఆలోచన. బీజేపీ అభ్యర్థులు ఉన్నచోటే కాకుండా లేని చోట కూడా మోదీతో సభలు పెట్టించారు చంద్రబాబు, ఆహా ఓహో అంటూ తనని, టీడీపీ పాలనను పొగిడించుకున్నారు. తిట్టిన నోటితోనే పొగిడించుకున్నాననేది చంద్రబాబు సెల్ఫ్ శాటిశ్ఫాక్షన్. కానీ ప్రజలు మోదీని కూడా అసహ్యించుకుంటున్నారనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అనుకుంటున్న వ్యతిరేకత తమకు ఎలా కలిసొస్తుందని బాబు అనుకుంటున్నారో.. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా కూటమికి ఇబ్బందిగా మారుతుందని ఆయన ఊహించలేకపోయారు. పదేళ్లలో కేంద్రం ఏపీకి ఏమీ చేయలేదనే కసి ఇక్కడి ప్రజల్లో ఉంది. అది కేవలం బీజేపీకే కాదు, టీడీపీకి కూడా చేటు చేస్తుంది.

మోదీని చూసి జనం కేరింతలు కొట్టడంతో ఏదో జరిగిపోయినట్టు అనుకోలేం. ప్రధాని రోడ్ షో కి వస్తే ఆమాత్రం సందడి ఉండటం సహజం. కానీ ఏపీలోని ముస్లిం ఓట్లన్నీ కూటమికి వ్యతిరేకం కావడమే ఇక్కడ విశేషం. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కోల్పోతామనే భయం ముస్లింలలో ఉంది. అందుకే వారంతా కూటమిని దూరం పెట్టారు, జగన్ కు మరింత దగ్గరయ్యారు.

ఇక చంద్రబాబు పొత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, జనసేన.. ఇలా అందరితోనూ పొత్తు పెట్టుకున్న చరిత్ర బాబుది. రేపు ఎన్డీఏలో కూడా ఎన్నిరోజులు ఉంటారోననే అనుమానం అందరిలో ఉంది. 2014లో కూడా ఇదే జరిగింది, ఈసారి కూడా అధికారం బాబుకి ఇస్తే.. తప్పులన్నీ కేంద్రంపై నెట్టేసి తప్పించుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అందుకే బాబుని ఎవరూ నమ్మడంలేదు. బీజేపీతో జట్టుకట్టినా చంద్రబాబుకి ప్రయోజనం లేదు. ఎల్లో మీడియా ఎలివేషన్లు తప్ప క్షేత్ర స్థాయిలో కూటమిని ప్రజలు పట్టించుకోవడంలేదు.

First Published:  9 May 2024 3:08 AM GMT
Next Story