Telugu Global
Andhra Pradesh

రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్‌ పేరు

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ లేకపోయినప్పటికీ కేబినెట్‌ భేటీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు అబద్దాలు చెప్పి దానికి ఆమోద ముద్ర‌ వేయించుకున్నారని సీఐడీ అభియోగం మోపింది.

రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్‌ పేరు
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సీఐడీ వెల్లడించింది. ఇందులోకి నారా లోకేష్ పేరు కూడా వచ్చేసింది. రిమాండ్ రిపోర్టును కోర్టుకు సీఐడీ సమర్పించింది. ఇందులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు కూడా ఉంది. మొత్తం స్కాంలో చంద్రబాబే సూత్రధారి అని ఆరోపించింది. చంద్రబాబే ఆర్థిక నేరానికి ప్రేరేపించారని ఆరోపించింది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ లేకపోయినప్పటికీ కేబినెట్‌ భేటీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు అబద్దాలు చెప్పి దానికి ఆమోద ముద్ర‌ వేయించుకున్నారని సీఐడీ అభియోగం మోపింది. 29 పేజీల రిమాండ్ రిపోర్టులో లోకేష్‌ పాత్రను ప్రస్తావించింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు ఓకే చేసి ఆ తర్వాత ముడుపులు ఎలా తీసుకునే వారు అన్న దానిపై వివరణ ఇచ్చింది. ఈ స్కిల్‌ స్కాంలో నారా లోకేష్‌కు అతడి ప్రధాన అనుచరులు కిలారు రాజేష్‌ ద్వారా అందినట్టు రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. తొలుత డబ్బులు చంద్రబాబు సీఎస్‌ శ్రీనివాస్‌కు అందాయని.. ఆ తర్వాత కిలారు రాజేష్‌ ద్వారా లోకేష్‌కు చేరాయని వివరించింది. ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించారంది.

కిలారు రాజేష్‌ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందినట్టు సీఐడీ వివరించింది. షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్‌వాయిస్‌లతో 371 కోట్లు మళ్లించారని వివరించింది. కీలక డాక్యుమెంట్ల మాయం వెనుక చంద్రబాబు హస్తముందని వెల్లడించింది. కాబట్టి ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోరింది. కస్టడీలో విచారించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని వివరించింది.

First Published:  10 Sep 2023 3:12 AM GMT
Next Story