Telugu Global
Andhra Pradesh

లోకేష్ న్యూమరాలజీ.. యువగళం సెకండ్ పార్ట్ కి ముహూర్తం ఖరారు

సెప్టెంబరు 9న కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో పాదయాత్రకు విరామం ఇచ్చిన లోకేష్, తిరిగి అక్కడి నుంచే యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.

లోకేష్ న్యూమరాలజీ.. యువగళం సెకండ్ పార్ట్ కి ముహూర్తం ఖరారు
X

జనవరి 27న నారా లోకేష్ కుప్పంలో తన యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తో ఆ యాత్రను అర్థాంతరంగా ఆపేశారు. తిరిగి బాబుకి బెయిల్ రావడంతో లోకేష్ మళ్లీ యాత్ర మొదలు పెడతానంటున్నారు. ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సారి కూడా న్యూమరాలజీనే నమ్ముకున్నారు లోకేష్. 2+7=9 వచ్చేలా ఈనెల 27నుంచి లోకేష్ యాత్ర మొదలు పెడతానని ప్రకటించారు. డిసెంబరు నెలాఖరు వరకు యాత్ర కొనసాగిస్తారు. విశాఖపట్నంలో యువగళం ముగుస్తుంది.

సెప్టెంబరు 9న చంద్రబాబుని సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో... లోకేశ్‌ పాదయాత్రకు విరామం ప్రకటించారు. స్కిల్ కేసులో ఇటీవల చంద్రబాబుకి రెగ్యులర్ బెయిలు రావడంతో ఇక లోకేష్ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబరు 9న కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో పాదయాత్రకు విరామం ఇచ్చిన లోకేష్, తిరిగి అక్కడి నుంచే యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ టౌన్, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్ర ముగిస్తారు లోకేష్.

400 రోజుల్లో 4 వేల కిలోమీటర్ల యాత్ర చేయాలనేది ఆయన లక్ష్యం. పాదయాత్రకు విరామం ప్రకటించే నాటికి లోకేష్ 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేశారు. 9 ఉమ్మడి జిల్లాల్లోని 84 నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగింది. దాదాపు రెండున్నర నెలల గ్యాప్ తర్వాత ఇప్పుడు తిరిగి యాత్ర మొదలుపెడుతున్నారు లోకేష్. వాస్తవానికి చంద్రబాబు జైలులో ఉండగా.. లోకేష్ విరామం తీసుకుని చేసిందేంటి అంటే టీడీపీ నేతల దగ్గరే జవాబు లేదు. చంద్రబాబు కేసుల కోసం ఢిల్లీలో మకాం వేశారు, లాయర్లతో మాట్లాడుతున్నారు.. అని చెప్పుకోవచ్చు కానీ దానివల్ల ఫలితం లేదనే చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు బయటకు రావడంతో లోకేష్ కి కాస్త ధైర్యం వచ్చింది. అందుకే యువగళం మళ్లీ మొదలు అంటున్నారు.


First Published:  23 Nov 2023 4:57 AM GMT
Next Story