Telugu Global
Andhra Pradesh

నారా లోకేశ్‌ వెనుకడుగు.. యువగళంకు మంగళం

ఇప్పటికే అధినేత చంద్రబాబు జైళ్లో ఉండడం, మళ్లీ లోకేశ్‌ను అరెస్టు చేస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతోనే పార్టీ నేతలు లోకేశ్‌ను పాదయాత్ర వాయిదా వేసుకోమన్నారని తెలుస్తోంది.

నారా లోకేశ్‌ వెనుకడుగు.. యువగళంకు మంగళం
X

నారా లోకేశ్‌ వెనుకడుగు.. యువగళంకు మంగళం

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర వాయిదా పడింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు, తర్వాతి పరిణామాలతో ఈ నెల 9న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేశారు లోకేశ్‌. అయితే.. పాదయాత్రను తిరిగి శుక్రవారం రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ అంతలోనే ఏమైందో తెలియదు.. పాదయాత్రను తిరిగి ప్రారంభించాలనుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు.

అయితే..అక్టోబర్‌ 3న స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున.. పాదయాత్రను వాయిదా వేసుకోవాలని పార్టీ నేతలు లోకేశ్‌ను కోరారని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేరిట ఓ లేఖ రిలీజ్‌ చేశారు. దిల్లీలో లాయర్లతో సంప్రదింపులు జరపాల్సిన అవసరమున్నందున..పాదయాత్రను వాయిదా వేసుకోవాలని కీలక నేతలు లోకేశ్‌ను కోరినట్లు లేఖలో పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తే లాయర్లతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారట. దీంతో పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేశ్.. పాదయాత్రను వాయిదా వేసేందుకు అంగీకరించారట.

అయితే.. పాదయాత్ర వాయిదా వేయడానికి అసలు కారణం వేరే ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ కేసులో లోకేశ్‌ను A-14గా చేర్చింది సీఐడీ. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, అమరావతి జోనల్ డిజైన్‌లను ఉద్దేశపూర్వకంగానే మార్చారని 2022 ఏప్రిల్‌లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేశ్‌ ఏపీకి వస్తే అరెస్టు చేయడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు జైళ్లో ఉండడం, మళ్లీ లోకేశ్‌ను అరెస్టు చేస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతోనే పార్టీ నేతలు లోకేశ్‌ను పాదయాత్ర వాయిదా వేసుకోమన్నారని తెలుస్తోంది. దీంతో పార్టీ నేతల సూచనతోనే లోకేశ్‌ పాదయాత్ర వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

First Published:  28 Sep 2023 12:24 PM GMT
Next Story