Telugu Global
Andhra Pradesh

యువగందరగోళం: నిన్న రథం సీజ్, నేడు సభకు అడ్డంకి

బంగారుపాళ్యం కూడలిలో బహిరంగసభను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది పోలీసులు, టీడీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది.

యువగందరగోళం: నిన్న రథం సీజ్, నేడు సభకు అడ్డంకి
X

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన మొదటిరోజు మినహా ఆ యాత్రని మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు. రెండు మూడు రోజులపాటు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని హైలెట్ చేశారు కానీ, ఆ తర్వాత అది కూడా లేదు, తాజాగా ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. అయితే అనుకోకుండా ఇప్పుడు యువగళం హైలెట్ అవుతోంది. నిన్న రథం సీజ్ చేయడంతో కాస్త హడావిడి నడిచింది, ఈరోజు బంగారుపాళ్యంలో పోలీసులు సభను అడ్డుకున్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత హైలెట్ అయింది. సభను అడ్డుకోవడంతో లోకేష్, దగ్గర్లో ఉన్న ఓ భవనంపైకి ఎక్కి ప్రసంగించారు.

బంగారుపాళ్యం కూడలిలో బహిరంగసభను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది పోలీసులు, టీడీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది. సభకు అనుమతిలేదని, ప్రజలతో ముఖాముఖి నిర్వహించేందుకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. మరోవైపు టీడీపీ నాయకులు మాత్రం ఎలాగైనా బహిరంగ సభ నిర్వహించాలని పట్టుబట్టారు. లోకేష్ ప్రచారవాహనంపై నుంచి ప్రసంగించకుండా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మొత్తమ్మీద చప్పగా సాగిపోతుంది అనుకున్న యువగళంలో పోలీసులు గందరగోళం సృష్టించారు. నిన్న రథం సీజ్ చేయడంతో జరిగిన గొడవ, ఈరోజు సభను అడ్డుకోవడంతో కంటిన్యూ అయింది. రేపు మరోచోట కూడా పోలీసులు ఇదే ఆనవాయితీ కొనసాగించే అవకాశముంది. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో యువగళం గందరగోళంతో హైలెట్ అవుతోంది.

సెల్ఫీ విత్ లోకేష్..

సహజంగా నాయకులు, సినీ తారలు ప్రజల్లోకి వస్తే వారితో సెల్ఫీలు దిగేందుకు యువత ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో జగన్ పాదయాత్రలో కూడా సెల్ఫీల హడావిడి బాగా నడిచింది. ఇప్పుడు లోకేష్ యువగళం యాత్రలో సెల్ఫీలకోసం ప్రత్యేకంగా సెల్ఫీ విత్ లోకేష్ అనే కార్యక్రమం పెట్టారు. ఆసక్తి ఉన్నవారంతా ఆ కార్యక్రమంలో పాల్గొని లోకేష్ తో సెల్ఫీలు దిగారు. కేవలం సెల్ఫీలకోసమే పాదయాత్రలో కొంత సమయం కేటాయిస్తున్నారు లోకేష్.

First Published:  3 Feb 2023 1:47 PM GMT
Next Story