Telugu Global
Andhra Pradesh

వచ్చే వారం నుంచి యువగళం.. పార్టీ నేతలతో లోకేష్ టెలికాన్ఫరెన్స్

చంద్రబాబు అరెస్ట్ తో యాత్రకు బ్రేక్ ఇచ్చి రాజమండ్రికి మకాం మార్చారు లోకేష్. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కూడా సాధించిందేమీ లేకపోవడంతో చివరకు యువగళానికే ఫిక్స్ అయ్యారు.

వచ్చే వారం నుంచి యువగళం.. పార్టీ నేతలతో లోకేష్ టెలికాన్ఫరెన్స్
X

నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అరెస్ట్ లకు భయపడి ఆయన ఢిల్లీలో దాక్కున్నారంటూ వైసీపీ సెటైర్లు పేలుస్తోంది. పోనీ లోకేష్ ఏదయినా ముఖ్యమైన పనికోసం ఢిల్లీలో ఉండిపోయారా అంటే అదీ లేదు. బీజేపీ పెద్దలెవరూ అపాయింట్ మెంట్ లు ఇవ్వలేదు, అక్కడ ఉన్నా కూడా ఇక్కడి నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. తాజాగా మరోసారి ఆయన నాయకులతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు పార్టీ తరుపున ధన్యవాదాలు తెలిపారు. వచ్చే వారం నుంచి యువగళం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో లోకేష్ యువగళం యాత్ర ఆగిపోయింది. చంద్రబాబు అరెస్ట్ తో ఆయన యాత్రకు బ్రేక్ ఇచ్చి రాజమండ్రికి మకాం మార్చారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కూడా సాధించిందేమీ లేకపోవడంతో చివరకు యువగళానికే ఫిక్స్ అయ్యారు. వచ్చే వారం నుంచి యువగళం మొదలు పెట్టే విషయంపై పార్టీ నేతలతో చర్చించారు లోకేష్. పొదలాడనుంచే యువగళం తిరిగి ప్రారంభించే అవకాశాలున్నాయి.

ఇంటింటి ప్రచారం..

ఇటీవల భవిష్యత్తుకి గ్యారెంటీ అంటూ టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపట్టారు. ఆ గ్యారెంటీ ఇచ్చిన నాయకుడే ఇప్పుడు రాజమండ్రి జైలులో ఉన్నారు. ఆయన భవిష్యత్తుకే గ్యారెంటీ లేని పరిస్థితి. అందుకే కొన్నాళ్లు గ్యారెంటీల విషయం వదిలిపెట్టి, చంద్రబాబు అరెస్ట్ పై నాయకులు ఫోకస్ చేయాలని చెప్పారు లోకేష్. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, అది జగన్ రాజకీయ కక్షసాధింపు అని చెబుతూ ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. లోకేష్ యువగళంలో కూడా ఇకపై మెయిన్ సబ్జెక్ట్ ఇదే అవుతుంది.

First Published:  24 Sep 2023 6:54 AM GMT
Next Story