Telugu Global
Andhra Pradesh

నువ్వు కోడిగుడ్డు, నువ్వే గాడిద గుడ్డు.. ఏపీలో ట్వీట్ వార్

తాజా మాజీ ఐటీ మంత్రులు ఇలా కోడిగుడ్డు, గాడిదగుడ్డు అని తిట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నువ్వు కోడిగుడ్డు, నువ్వే గాడిద గుడ్డు.. ఏపీలో ట్వీట్ వార్
X

ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీ మాజీ ఐటీ మంత్రి నారా లోకేష్ తిట్ల పురాణం ఇది. నువ్వు కోడిగుడ్డు అంటే, కాదు నువ్వే గాడిద గుడ్డు అంటూ ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఎన్నికల వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరగడంతో ఆరోపణలు, మాటల యుద్ధాలు కూడా తారా స్థాయికి చేరుకుంటున్నాయి. వీరి తిట్ల పురాణం నెటిజన్లకు మాత్రం కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది.


ఎందుకీ కోడిగుడ్డు..?

ఆమధ్య గుడివాడ అమర్నాథ్ మీడియాకి ఓ కోడిగుడ్డు స్టోరీ చెప్పారు. కోడిపెట్ట నేరుగా కోడిని పెట్టదని, గుడ్డుని మాత్రమే పెడుతుందని, ఆ గుడ్డు పొదిగిన తర్వాత పిల్లవుతుందని, పెరిగి పెద్దదై కోడిగా మారుతుందని సోదాహరణంగా వివరించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ-కార్ రేస్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి ఆయన్ను కోడిగుడ్డు మంత్రిగా టీడీపీ వెటకారం చేస్తోంది. ఇటీవల ఆ హడావిడి తగ్గినా మళ్లీ నారా లోకేష్ ఆ ప్రస్తావన తెచ్చారు. అనకాపల్లి పర్యటనలో మంత్రి అమర్నాథ్ ని మరోసారి కార్నర్ చేస్తూ మాట్లాడారు లోకేష్. పనిలో పనిగా కోడిగుడ్డు అనేశారు.

గాడిద గుడ్డు..

కోడిగుడ్డు అంటూ లోకేష్ చేసిన వెటకారానికి ట్విట్టర్లో సమాధానమిచ్చారు మంత్రి అమర్నాథ్. తనను కోడి గుడ్డుతో పోల్చిన గాడిద గుడ్డు నారా లోకేష్ కి ఇదే తన సవాల్ అంటూ ట్వీట్ వేశారు. లోకేష్ తో కానీ, టీడీపీలో గెలిచిన ఏ ఎమ్మెల్యేతో అయినా తాను చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు అమర్నాథ్. అయితే ఈ క్రమంలో ఆయన లోకేష్ ని గాడిదగుడ్డు అని సంబోధించడం విశేషం. తాజా మాజీ ఐటీ మంత్రులు ఇలా కోడిగుడ్డు, గాడిదగుడ్డు అని తిట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First Published:  18 Dec 2023 4:01 AM GMT
Next Story