Telugu Global
Andhra Pradesh

వీడియో కాన్ఫరెన్స్ లు మొదలు పెట్టిన లోకేష్..

'400 రోజులు, 4 వేల కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రకు .. మీ సూచనలు, మీ మద్దతు నాకు కావాలి' అన్నారు. 'మన దేవుడు ఎన్టీఆర్ ఆశయాలను, మన రాముడు చంద్రబాబు విజన్ ని ముందుకు తీసుకెళ్లేందుకు యువగళం మంచి వేదిక కాబోతుంది' అన్నారు లోకేష్.

వీడియో కాన్ఫరెన్స్ లు మొదలు పెట్టిన లోకేష్..
X

వీడియో కాన్ఫరెన్స్ లు మొదలు పెట్టిన లోకేష్

ఈనెల 27న ప్రారంభించబోతున్న యువగళం పాదయాత్ర సన్నాహకంగా నారా లోకేష్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో నాయకులతో మాట్లాడారు. పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే యువగళం యాత్ర చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పోరాడుతానన్నారు. సైకో ప్రభుత్వం స్పందించకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చాక తామే పరిష్కరిస్తామని తెలిపారు.

ఎన్నో మంచిపనులు చేయొచ్చు.. కానీ..!

రాష్ట్ర ప్రజలు వైసీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినందుకు గాను, ఎన్నో మంచి పనులు చేయొచ్చని, కానీ వైసీపీ నేతలు కక్షసాధింపు ధోరణితో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని మండిపడ్డారు లోకేష్. మూడున్నరేళ్లుగా ఏపీలో సైకో పాలన చూస్తున్నామని ఎద్దేవా చేశారు. సమస్యలపై పోరాడుతున్న టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. అక్రమ కేసులతో వేధిస్తున్నా కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు వెనక్కి తగ్గడం లేదన్నారు.

వార్ ఒన్ సైడ్ అయిపోయిందని, ప్రజలంతా టీడీపీ వైపు ఉన్నారని చెప్పారు లోకేష్. సైకో పాలన పోయి సైకిల్ పాలన రాబోతోందని, దీని కోసం అందరం కలిసి ప్రజలకు మరింత దగ్గర కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటికే బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లామని, అందరి ఆశీస్సులతో త్వరలో యువగళం పాదయాత్ర చేపట్టబోతున్నానని చెప్పారు. '400 రోజులు, 4 వేల కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రకు .. మీ సూచనలు, మీ మద్దతు నాకు కావాలి' అన్నారు. 'మన దేవుడు ఎన్టీఆర్ ఆశయాలను, మన రాముడు చంద్రబాబు విజన్ ని ముందుకు తీసుకెళ్లేందుకు యువగళం మంచి వేదిక కాబోతుంది' అన్నారు లోకేష్.

పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చారా..?

ఏపీలో జీవో నెంబర్-1 తీసుకొచ్చిన తర్వాత నారా లోకేష్ పాదయాత్రపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే అది సభలు, సమావేశాలకేనని, యాత్ర యధావిధిగా కొనసాగే అవకాశముందని టీడీపీ అంచనా. ఆ జీవో కూడా హైకోర్టు కొట్టివేయడం, సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో లోకేష్ పాదయాత్రకు అడ్డంకుల్లేవని అనుకుంటున్నారు. కానీ అధికారికంగా యాత్రకు అనుమతులు మంజూరు కాలేదు.

యువగళం పాదయాత్రకు అనుమతులు కోరుతూ జనవరి 12న రాష్ట్ర డీజీపీ, హోం శాఖ సెక్రటరీ, చిత్తూరు జిల్లా ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డిఎస్పీలకు టీడీపీ లేఖలు రాసింది. అయితే అనుమతి ఇస్తున్నట్టు కానీ, అనుమతి లేదు అని కానీ.. ప్రభుత్వం, పోలీసు శాఖ నుంచి స్పందించలేదు. ప్రభుత్వం, పోలీసులు.. అనుమతి ఇచ్చినా, ఇవ్వక పోయినా యువ గళం యాత్ర జరిగి తీరుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు

First Published:  20 Jan 2023 11:06 AM GMT
Next Story