Telugu Global
Andhra Pradesh

అవేం ప్రశ్నలు..? నా టైమ్ వేస్ట్ చేశారు.. సీఐడీపై లోకేష్ అసహనం

సీఐడీ విచారణ సమయం వృథా తప్ప మరోటి కాదన్నారు నారా లోకేష్. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌ మెంట్‌ పై సీఐడీ ఓ సినిమా చూపించిందన్నారు.

అవేం ప్రశ్నలు..? నా టైమ్ వేస్ట్ చేశారు.. సీఐడీపై లోకేష్ అసహనం
X

వాషింగ్ మిషన్ లో వేసి తిప్పినట్టుగా నిన్న అడిగిన ప్రశ్నలే తిప్పి తిప్పి ఈరోజు కూడా అడిగారంటూ నారా లోకేష్ సీఐడీ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెండోరోజు కూడా ఆయన ఉదయం 10గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ విచారణకు హాజరయ్యారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న లోకేష్.. రెండోరోజు తనను 47 ప్రశ్నలు అడిగారని మీడియా సమావేశంలో వివరించారు.


మా అమ్మ ఐటీ రిటర్న్స్ వారికెలా వచ్చాయి..?

"మా అమ్మ భువనేశ్వరి ఐటీ రిటర్న్స్.. నా ముందు పెట్టి ప్రశ్నించారు. ఆమె ఐటీ రిటర్న్స్‌ మీ వద్దకు ఎలా వచ్చాయని అడిగితే సమాధానం చెప్పలేదు. దీనిపై న్యాయ పరంగా పోరాటం చేస్తా. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుకి సంబంధించి కేవలం నాలుగైదు ప్రశ్నలు మాత్రమే అడిగారు. నా శాఖకు సంబంధం లేని ప్రశ్నలే ఎక్కువగా అడిగారు." అని చెప్పుకొచ్చారు లోకేష్.

సమయం వృథా..

సీఐడీ విచారణ సమయం వృథా తప్ప మరోటి కాదన్నారు నారా లోకేష్. కోర్టు కేవలం ఒకరోజే విచారణకు హాజరు కావాలని చెప్పిందని, కానీ సీఐడీ అధికారుల విజ్ఞప్తి మేరకు తాను రెండోరోజు కూడా వచ్చానన్నారు. సీఆర్డీఏ ఏర్పాటు, రాజధాని ఏర్పాటు నిర్ణయం వంటి ప్రశ్నలు తన శాఖకు సంబంధం లేకపోయినా అవి కూడా అడిగారని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌ మెంట్‌ పై సీఐడీ ఓ సినిమా చూపించిందన్నారు లోకేష్. సీఐడీ చూపించిన సినిమాలో అలైన్‌ మెంట్‌ మార్పు వల్ల హెరిటేజ్ భూమి కోల్పోతోందన్న విషయం స్పష్టమైందన్నారు.

ప్రభుత్వ వేధింపుల వల్ల రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టడంలేదని విమర్శించారు లోకేష్. సంబంధం లేకపోయినా తనపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ప్రభుత్వ చర్యలతో నష్టపోయేది రాష్ట్ర నిరుద్యోగ యువతేనని చెప్పారు. స్కిల్‌ కేసులో సంతకాలు పెట్టిన ప్రేమ్‌ చంద్రారెడ్డి, అజేయ కల్లంను ఎందుకు విచారించట్లేదని ప్రశ్నించారు. పాలసీ ఫ్రేమ్‌ చేసిన చంద్రబాబును మాత్రం రిమాండ్‌ కు పంపించారని, ఇది కక్షసాధింపు చర్య అని అన్నారు లోకేష్.

First Published:  11 Oct 2023 1:42 PM GMT
Next Story