Telugu Global
Andhra Pradesh

మరింత గట్టిగా అబద్ధాలు.. శంఖారావం పూరించిన లోకేష్

మరింత గట్టిగా అబద్ధాలు.. శంఖారావం పూరించిన లోకేష్
X

యువగళం అట్టర్ ఫ్లాప్ కావడంతో నారా లోకేష్ కొత్తగా శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర నుంచి ఈరోజు శంఖారావం యాత్ర మొదలు పెట్టిన ఆయన ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తన ప్రసంగంలో అబద్ధాలు దంచి కొట్టారు లోకేష్. వరుస డీఎస్సీలతో ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చింది తమ కుటుంబమేనని వివరించారు. అయితే ఇక్కడ లోకేష్ తెలివిగా తాత పేరు కూడా వాడేసుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు కలసి వివిధ డీఎస్సీల ద్వారా 1.70 లక్షల పోస్టులు భర్తీ చేశారన్నారు. ఈ ఉదాహరణ చాలు లోకేష్ ఎంత అతి తెలివిగా మాట్లాడారో చెప్పడానికి. తాత భర్తీ చేసిన టీచర్ పోస్ట్ ల్ని కూడా తండ్రి ఖాతాలో జమ చేసి.. అదంతా టీడీపీ గొప్ప అంటూ రెచ్చిపోయారు లోకేష్.

ఏపీలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాల్లో ప్రభుత్వానికి మంచి ఇమేజ్ ఉంది. రాగా పోగా ఉద్యోగ వర్గాల్లో అది కూడా ఉపాధ్యాయ వర్గాల్లో కాస్త అసంతృప్తి ఉంది. సీపీఎస్ రద్దు సహా ఇంక్రిమెంట్ల విషయంలో ఉపాధ్యాయ వర్గాల్లో ఉన్న అసంతృప్తిని రెచ్చగొట్టే పనిలో టీడీపీ నిమగ్నమైంది. అందులోనూ ఇటీవల డీఎస్సీ ప్రకటనలో అప్రెంటిస్ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చింది. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు కొన్నిసార్లు వైరి వర్గాలకు అనుకోని అవకాశాలుగా మారతాయి. ప్రస్తుతం టీడీపీ అదే పని చేస్తోంది. డీఎస్సీ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని, అప్రెంటిస్ విధానాన్ని తిరిగి తెరపైకి తీసుకు రాబోమని హామీ ఇచ్చారు లోకేష్.

నమ్మేదెలా..?

ప్రతి ఏటా డీఎస్సీ అనేది ఎన్నికల ముందు అన్ని పార్టీలు చెప్పే మాటే. అయితే అధికారంలోకి వచ్చాక ఖాళీలు, అవసరాలు, ఖజానా వ్యవహారాలు అన్నీ సమీక్షించి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటారు. ఏపీలో ముందుగా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి ఆ తర్వాత టీచర్ పోస్ట్ ల భర్తీకి సిద్ధమయ్యారు సీఎం జగన్. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చారు. అమ్మఒడితో పేద పిల్లలను స్కూళ్లకు తిరిగి రప్పించగలిగారు. ఇంగ్లిష్ మీడియం చదువులు, ట్యాబ్ ల పంపిణీ, స్కూల్ కిట్.. వంటి కార్యక్రమాల ద్వారా ఊహించని రీతిలో విద్యావ్యవస్థను మార్చగలిగారు. ఈ పనులన్నీ చేయకుండా కేవలం డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్ట్ లు భర్తీ చేస్తే ప్రజలకు ఉపయోగమేంటి..? నిజంగా జగన్ ముందు చూపుతోనే వ్యవహరించారు. కానీ టీడీపీ మాత్రం డీఎస్సీ పేరుతో మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూస్తోంది. ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాన్ని రెచ్చగొట్టేందుకు అసత్య ప్రచారం మొదలు పెట్టింది. మరి లోకేష్ పూరించిన అసత్య శంఖారావం ఎంతమందిపై ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.

First Published:  11 Feb 2024 7:38 AM GMT
Next Story