Telugu Global
Andhra Pradesh

వైఎస్ఆర్, జగన్ వీడియోలు చూస్తూ.. పాదయాత్రకు ప్రాక్టీస్ చేస్తున్న నారా లోకేశ్.!

నారా లోకేశ్ ఇమేజ్‌ను పెంచడంతో పాటు, భవిష్యత్ సీఎంగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అతని పాదయాత్రకు రూపకల్పన చేశారు.

వైఎస్ఆర్, జగన్ వీడియోలు చూస్తూ.. పాదయాత్రకు ప్రాక్టీస్ చేస్తున్న నారా లోకేశ్.!
X

తెలుగుదేశం పార్టీని ఏపీలో తిరిగి అధికారంలోకి తీసుకొని రావడానికి అధినేత చంద్రబాబు నాయుడు అనేక వ్యూహాలను రచిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీని దీటుగా ఎదుర్కోవడానికి పార్టీని సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా యువ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాదయాత్ర చేయించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో నారా లోకేశ్ మంత్రిగా పని చేశారు. కానీ, అది అతనికి పెద్ద అడ్డంకిగా మారింది. ఇతర వారసుల మాదిరిగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా దొడ్డి దారిన (ఎమ్మెల్సీ) మంత్రి అయ్యారనే అపవాదు మూటగట్టుకున్నారు. పైగా మంత్రి పదవి ద్వారా తన ఇమేజ్‌ను ఏ మాత్రం పెంచుకోలేక పోయారు.

నారా లోకేశ్ ఇమేజ్‌ను పెంచడంతో పాటు, భవిష్యత్ సీఎంగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అతని పాదయాత్రకు రూపకల్పన చేశారు. జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానున్నది. దాదాపు 4 వేల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. కాగా, ఈ విషయంలో లోకేశ్‌కు ప్రస్తుతం ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో కాస్త భారీకాయంతో ఉండే లోకేశ్.. చాన్నాళ్ల కిందటే బరువు తగ్గించుకొని ఫిట్‌గా మారారు. అయితే అతడి మాట తీరు ఆకట్టుకునేలా ఉండదు. పైగా ప్రజల్లోకి వెళ్తే ఎలా మెలగాలో పెద్దగా అవగాహన లేదు. ఈ విషయాలపైనే ప్రస్తుతం హైదరాబాద్‌లో నిపుణుల చేత శిక్షణ ఇప్పిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ గతంలో 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ రెండు పాదయాత్రలు వారికి అధికారాన్ని తెచ్చిపెట్టాయి. అంతే కాకుండా ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ను పెంచాయి. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రను కూడా అలాగే సక్సెస్ చేయాలని టీడీపీ, చంద్రబాబునాయుడు పట్టుదలతో ఉన్నారు.

వైఎస్ఆర్, జగన్ పాదయాత్రలు చేసినప్పుడు తమదైన శైలిలో ప్రజలను పలకరిస్తూ వెళ్లారు. వైఎస్ జగన్ రాయలసీమ మాండలికంలో ప్రతీ ఒక్కరిని పిలుస్తూ ఆకట్టుకున్నారు. అవ్వా, తాతా, అమ్మా, అన్నా అని పలుకరిస్తూ.. తలపై చేతలు పెట్టి ఆప్యాయంగా మాట్లాడుతూ.. ముద్దులు పెడుతూ సాగిపోయారు. ఇప్పుడు ఆ వీడియోలన్నీ లోకేశ్‌కు చూపిస్తున్నారు. లోకేశ్ కూడా రాయలసీమ మూలాలున్న వ్యక్తే. కానీ అతడికి ఆ యాస అంతగా అబ్బలేదు. తెలుగులో మాట్లాడటానికే ఇబ్బంది పడే లోకేశ్‌కు ఇప్పుడు కాస్త యాసను కూడా నేర్పిస్తున్నట్లు తెలుస్తున్నది.

ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారిని ఎలా పలకరించాలి, ఎలా మాట్లాడాలి, వాళ్లు ప్రస్తావించే సమస్యలపై ఎలా స్పందించాలనే శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలుస్తున్నది. గత పాదయాత్రలకు భిన్నంగా.. లోకేశ్ పాదయాత్ర కొనసాగాలని టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. లోకేశ్‌ కంటూ ప్రత్యేక శైలి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఏయే నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయంపై రిపోర్టులు తెప్పించుకున్నారు. వాటిపై సమగ్ర అవగాహన కూడా లోకేశ్‌ను కల్పిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లిన్నప్పుడు ఎలాంటి భయం లేకుండా వ్యవహరించేలా నిపుణులు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. మొత్తానికి నారా లోకేశ్ పాదయాత్రకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story