Telugu Global
Andhra Pradesh

లోకేష్ పాదయాత్రలో అసలు సమస్యేంటో తెలుసా..?

ఇక్కడే లోకేష్ కు పెద్ద సమస్య ఎదురవుతోంది. అదేమిటంటే.. మూడున్నరేళ్ళ క్రితంవరకు అధికారంలో ఉన్నది టీడీపీనే. 2014లో వందల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తర్వాత వాటిని తొంగలో తొక్కేశారు.

లోకేష్ పాదయాత్రలో అసలు సమస్యేంటో తెలుసా..?
X

కుప్పంలో వారంరోజుల క్రితం మొదలైన నారా లోకేష్ పాదయాత్ర యువగళం జనాలను పెద్దగా ఆకట్టుకోవటంలేదన్నది వాస్తవం. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఏమి అంచనాలు వేసుకున్నారో, యాత్ర సక్సెస్ కు ఏమి ప్లానింగ్ జరిగిందో తెలీదు. అయితే యాత్ర మొదలైన దగ్గర నుండి చాలా చోట్ల జనాలు పెద్దగా కనబడటం లేదని పార్టీవర్గాలే అంగీకరిస్తున్నాయి. లోకేష్ పాదయాత్ర ఇంత పేలవంగా జరుగుతుందని ఎవరు ఊహించుండరు.

ఎంతో ప్లానింగ్ చేసి, ఎల్లోమీడియా అపారమైన మద్దతున్నా కూడా పాదయాత్రపై ఎందుకని నెగిటివ్ ప్రచారం జరుగుతోంది..? పాదయాత్రలో ఎక్కడ లోపముంది..? పార్టీవర్గాల సమాచారం ప్రకారం లోకేష్ పాదయాత్రకు అసలిది తగిన సమయం కాదట. ఎందుకంటే.. పాదయాత్రలో జనాలను కలిసే సమయంలో ఎవరైనా ఏమిచేస్తారు..? తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామనే విషయాలపై హామీలిస్తారు. ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడతారు.

ఇక్కడే లోకేష్ కు పెద్ద సమస్య ఎదురవుతోంది. అదేమిటంటే.. మూడున్నరేళ్ళ క్రితంవరకు అధికారంలో ఉన్నది టీడీపీనే. 2014లో వందల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తర్వాత వాటిని తొంగలో తొక్కేశారు. ఐదేళ్ళకాలంలో సంపూర్ణంగా చంద్రబాబు అమలుచేసిన హామీ ఒక్కటికూడా లేదు. దీనికితోడు అనేక కారణాలు కూడా తోడై 2019 ఎన్నికల్లో జనాలు ఘోరంగా ఓడగొట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీచేయకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇదిచేస్తామని చెబితే జనాలు నమ్ముతారా..?

చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన వద్దనే కదా జనాలు అంత ఘోరంగా ఓడగొట్టింది. అలాంటిది కొడుకొచ్చి జనరంజక పాలన చేస్తామంటే జనాలు ఎందుకు నమ్ముతారు..? చంద్రబాబు హామీలనే జనాలు నమ్మటంలేదంటే.. ఇక లోకేష్ ను ఎందుకు పట్టించుకుంటారు..? ఈ పాయింటే పాదయాత్రకు అతిపెద్ద మైనస్ అయ్యింది. అందుకనే పాదయాత్రలో పాల్గొనేందుకు, లోకేష్ ను చూసేందుకు జనాలు పెద్దగా స్పందించటంలేదు. మరి పాదయాత్ర జరుగుతున్న విధానంపైన, జనాల స్పందన పైన చంద్రబాబు ఫీడ్ బ్యాక్ తెప్పించుకోకుండానే ఉంటారా..?

First Published:  5 Feb 2023 5:39 AM GMT
Next Story