Telugu Global
Andhra Pradesh

నెల్లూరులో లోకేష్ మదర్ సెంటిమెంట్

తాను చిన్నప్పుడు చెల్లి కావాలని తన తల్లిని అడిగేవాడినని, బ్రాహ్మణి గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నానని చెప్పారు లోకేష్.

నెల్లూరులో లోకేష్ మదర్ సెంటిమెంట్
X

నెల్లూరులో లోకేష్ మదర్ సెంటిమెంట్

"ఏ తప్పూ చేయని నా తల్లి, ఎప్పుడూ బయటకు రాని నా తల్లి.. దాదాపుగా ఓ నెల రోజులపాటు ఎమోషనల్ టార్చర్ అనుభవించింది. ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలు ఎగతాళి చేస్తుంటారు. ఇది ఎంతవరకు న్యాయం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ, ఇతర ముఖ్యమంత్రులు కానీ ఎప్పుడూ కుటుంబం గురించి మాట్లాడేవారు కాదు. కానీ మొదటిసారి జగన్ హయాంలో రాజకీయాలు దిగజారిపోయాయి. ఓ తల్లి పడే బాధ, ఆవేదన నేను వ్యక్తిగతంగా చూశా. ఇది ఇంకో తల్లికి జరగకూడదనేది నా తాపత్రయం." అంటూ నెల్లూరులో జరిగిన మహిళా శక్తి కార్యక్రమంలో మాట్లాడారు నారా లోకేష్. తల్లి గురించి మాట్లాడుతుండగా ఆయన కళ్లు చెమ్మగిల్లాయి.


మహిళా శక్తి పేరుతో నెల్లూరు నగరంలో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు నారా లోకేష్. నిర్భయ చట్టాన్ని కఠినంగా అమలుచేసి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తొలిఏడాది లోనే మహిళలకు మహాశక్తి పథకం అమలు చేస్తామన్నారు.

కఠిన చట్టాలు అమలు చేస్తాం..

నిర్భయ చట్టాన్ని అమలుచేయడం ద్వారా మహిళలకు పటిష్టమైన రక్షణ కల్పిస్తామన్నారు లోకేష్. 145రోజుల సుదీర్ఘ పాదయాత్రలో తాను మహిళల కష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే టీడీపీ లక్ష్యం అన్నారు లోకేష్. మహిళలను గౌరవించాలన్న ఆలోచన మనసులో రావాలని, అందుకోసం ప్రత్యేక పాఠ్యాంశాలు తెచ్చి, సామాజిక చైతన్యం తెచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రించి, సామాజిక చైతన్యం కల్పిస్తామని చెప్పారు. అంగన్ వాడీలకు జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్దరించి పీజీ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు లోకేష్.

తాను చిన్నప్పుడు చెల్లి కావాలని తన తల్లిని అడిగేవాడినని, బ్రాహ్మణి గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నానని చెప్పారు లోకేష్. తన తల్లి భువనేశ్వరి తనను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెంచిందని, సమాజంలోని అందరు తల్లులు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని కోరుకుంటున్నానని అన్నారు లోకేష్.

First Published:  3 July 2023 12:00 PM GMT
Next Story