Telugu Global
Andhra Pradesh

డైమండ్ పాప.. చీర, గాజులు పంపు.. రోజాపై లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

నందమూరి తారక రామారావు నుంచి, చంద్రబాబు వరకు మహిళల సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడింది అప్పటివరకు వివరించిన లోకేష్ అదే వేదికపై మహిళ అయిన రోజాను డైమండ్ పాప అని పిలవడం ఏంటని సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.

డైమండ్ పాప.. చీర, గాజులు పంపు.. రోజాపై లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రి రోజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకన్నా ఎంతో పెద్దదైన రోజాను పట్టుకుని డైమండ్ పాప అని పిలవడంపై వైసీపీ శ్రేణుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువగళం పేరిట నారా లోకేష్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లాలో జరుగుతోంది.

పాదయాత్ర ప్రారంభించిన రోజు తనకు మంత్రి రోజా చీర, గాజులు పంపుతానని చెప్పిందని లోకేష్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మూడో రోజు పాదయాత్రలో కూడా మరోసారి లోకేష్ ఆ ప్రస్తావన తెచ్చారు. మహిళలతో జరిగిన సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ మంత్రి రోజాపై విమర్శలు చేశారు.మహిళలను గౌరవించాల్సిన మంత్రి రోజా మహిళలను అవమానపరిచిందన్నారు. ఆమె తనకు చీర, గాజులు పంపుతానని చెప్పారని ఆరోపించారు. అది మహిళలను అవమానపరచడమేన్నారు.

ఒక మహిళా మంత్రే మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడుతుంటే.. ఇక వీధి రౌడీలు ఏ విధంగా రెచ్చిపోతారో ఆలోచించాలన్నారు. 'అందుకే నేను ఆ డైమండ్ పాపకి చెప్పా. చీర, గాజులు పంపించు. వాటిని మా తెలుగింటి ఆడపడుచులకు అందించి వారి కాళ్లు మొక్కుతానని చెప్పాను' అని లోకేష్ అన్నారు.

అయితే లోకేష్ రోజాను డైమండ్ పాప..అంటూ పిలవడంపై వైసీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట శ్రీకాకుళంలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజాను డైమండ్ రాణి అంటూ సంబోధించారు. అయితే ఇప్పుడు రోజా కంటే చిన్నవాడైన లోకేష్ రోజాను డైమండ్ పాప..అని సంబోధించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి తారక రామారావు నుంచి, చంద్రబాబు వరకు మహిళల సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడింది అప్పటివరకు వివరించిన లోకేష్ అదే వేదికపై మహిళ అయిన రోజాను డైమండ్ పాప అని పిలవడం ఏంటని సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.

First Published:  29 Jan 2023 1:51 PM GMT
Next Story