Telugu Global
Andhra Pradesh

లోకేశ్.. ఇదేం లాజిక్

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో లోకేశ్‌ హస్తం కూడా ఉందని వైసీపీ ఆరోపించింది. ఇందుకు లోకేశ్‌ స్పందిస్తూ .. అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు 24 గంటల్లో ఆధారాలతో సహా నిరూపించాలని స‌వాలు విసిరారు.

లోకేశ్.. ఇదేం లాజిక్
X

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఏపీకి సంబంధించిన ఓ స్కామ్‌లోనూ ఈడీ పలువురికి నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. రూ. కోట్లు పక్కదారి పట్టినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించారు. తాజాగా మరికొంత మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

అయితే అప్పట్లో నారా లోకేశ్ మంత్రిగా ఉన్నారు కనుక.. ఈ స్కామ్‌లో ఆయన హస్తం కూడా ఉందని వైసీపీ ఆరోపించింది. లోకేశ్ కూడా ఈ కేసులో ఇరుక్కోవచ్చని జోస్యం చెప్పింది. అయితే ఇందుకు సంబంధించి తాజాగా వైసీపీ నేతలకు లోకేశ్ ఓ సవాల్ విసిరారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు 24 గంటల్లో ఆధారాలతో సహా నిరూపించాలని ఆయన చాలెంజ్ విసిరారు.

కాగా ఈ విషయంపై వైసీపీ నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు. కేంద్ర పరిధిలో ఉన్న ఈడీ విచారణ జరుపుతుంటే.. తామెందుకు ఆధారాలు సమర్పిస్తామన్నది వారి ప్రశ్న. నిజంగా లోకేశ్‌కు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ కేసులో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోకుండా విచారణకు సహకరించాలని వారు కోరారు. గతంలో పలు కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి ఈ కేసు ముందుకు సాగుతుందా? లోకేశ్ అవినీతి చేసినట్టు ఈడీ నిరూపిస్తుందా? అన్నది వేచి చూడాలి.

First Published:  6 Dec 2022 8:40 AM GMT
Next Story