Telugu Global
Andhra Pradesh

లోకేష్ అరెస్ట్ అయ్యేది ఆ కేసులోనేనా..?

ఈ కేసులో నారాయణ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు బెయిల్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఇప్పుడు లోకేష్ వంతు వచ్చింది.

లోకేష్ అరెస్ట్ అయ్యేది ఆ కేసులోనేనా..?
X

చంద్రబాబు జైలులో ఉన్నారు, బెయిలు వచ్చే పరిస్థితి కనపడ్డంలేదు, రిమాండ్ కూడా ముందుకెళ్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నట్టుగా ఒకవేళ ఇది నిజంగా వైసీపీ ప్రతీకార చర్యే అయితే.. జైలు అనేది కేవలం చంద్రబాబుతోనే ఆగిపోదు, ఆ వెంట లోకేష్ కూడా లోపలికి వెళ్లాల్సిందే. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు, సీఐడీ కేసుల విచారణ చూస్తుంటే రేపో మాపో చినబాబు కూడా లోపలికి వెళ్లక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా నారా లోకేష్ పేరుని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చేర్చింది సీఐడీ. ఏ-14గా లోకేష్ ని ఈ కేసులో చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు కూడా ఇరుక్కున్నారు. ఆయనతోపాటు అప్పటి మంత్రి నారాయణపై కూడా సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో నారాయణ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు బెయిల్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఇప్పుడు లోకేష్ వంతు వచ్చింది. ఆయన పేరు కూడా ఈ కేసులో చేర్చడంతో టీడీపీలో హడావిడి మొదలైంది.

తప్పు చేసినవారు కచ్చితంగా విచారణ ఎదుర్కోవాలి, నేరం రుజువైతే శిక్ష అనుభవించాలి. కానీ చంద్రబాబు మానవాతీతుడంటూ టీడీపీ న్యాయవ్యవస్థపైనే కామెంట్లు చేస్తోంది. అంత చిన్న స్కామ్ లో చంద్రబాబు ఇరుక్కోవడమేంటని ప్రశ్నిస్తున్నారు కుటుంబ సభ్యులు. వైసీపీ కక్షసాధింపు అంటూ మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ఇక్కడ నడుస్తుండగా నారా లోకేష్ మాత్రం ఢిల్లీలో మకాం పెట్టారు. అసలు లోకేష్ ఢిల్లీ ఎందుకెళ్లారు, ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయంలో ఎల్లో మీడియా వద్దే సరైన సమాచారం లేదు. కేసులకు భయపడి లోకేష్ ఢిల్లీలో దాక్కున్నారంటూ వైసీపీ వెటకారం మరోవైపు మంట పెడుతోంది. ఈ దశలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ అధికారులు లోకేష్ పేరుని చేర్చడం మరింత సంచలనంగా మారింది. లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తేరేమోనని ఆమధ్య స్వయానా ఆయన భార్య బ్రాహ్మణి సెలవిచ్చారు. అయితే ఆ అరెస్ట్ ఏ కేసులో అనేది తేలాల్సి ఉంది.

First Published:  26 Sep 2023 8:52 AM GMT
Next Story